గూగుల్ 'నానో బనానా' ఏఐ టూల్ పై వీసీ సజ్జనార్ హెచ్చరిక!

  • వైరల్ అవుతున్న 'నానో బనానా' ఏఐ ట్రెండ్
  • వ్యక్తిగత ఫోటోల మార్ఫింగ్‌తో భద్రతకు ముప్పు అని హెచ్చరిక
  • ఏఐ వాటర్‌మార్కులు నమ్మశక్యంగా లేవంటున్న టెక్ నిపుణులు
  • నకిలీ యాప్‌ల ద్వారా డేటా చోరీ, ఆర్థిక మోసాల ప్రమాదం
  • ఆన్‌లైన్‌లో వ్యక్తిగత ఫోటోలు పెట్టొద్దని పోలీసు అధికారి సూచన
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ విపరీతంగా వైరల్ అవుతోంది. తమ ఫోటోలను ప్రత్యేకమైన 3డి బొమ్మల రూపంలోకి, పాతతరం బాలీవుడ్ హీరోయిన్ల చీరకట్టు శైలిలోకి మార్చుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం బాగా ప్రాచుర్యం పొందింది. గూగుల్ సంస్థకు చెందిన 'జెమిని నానో బనానా' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ ద్వారా ఈ ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు.  'నానో బనానా', 'బనానా ఏఐ శారీ' పేర్లతో నడుస్తున్న ఈ ట్రెండ్ చూడటానికి చాలా సరదాగా ఉన్నప్పటికీ, దీని వెనుక తీవ్రమైన ప్రైవసీ, భద్రతాపరమైన ముప్పులు పొంచి ఉన్నాయని టెక్నాలజీ నిపుణులు, సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

వీసీ సజ్జనార్ ఏమన్నారంటే...!

ఈ ట్రెండ్‌పై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. అధికారిక ప్లాట్‌ఫామ్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్లు లేదా యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఒకసారి మన డేటా అనధికారిక ప్లాట్‌ఫామ్‌లకు చేరితే, దాన్ని తిరిగి పొందడం దాదాపు అసాధ్యమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

యువతను ఆకర్షిస్తున్న ట్రెండ్ 

గత నెలలో ప్రారంభమైన ఈ ఏఐ టూల్, అప్‌లోడ్ చేసిన ఫోటోలను క్షణాల్లో ఆకర్షణీయమైన చిత్రాలుగా మారుస్తుండటంతో యువత దీనికి బాగా ఆకర్షితులవుతున్నారు. అయితే, ఈ ప్రక్రియలో వినియోగదారులు తమ వ్యక్తిగత ఫోటోలను థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్‌లకు అప్పగించాల్సి వస్తోంది. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల డేటాను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లను సృష్టించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

కాగా, సున్నితమైన ఫోటోలను, లొకేషన్ వివరాలను ఇలాంటి ఏఐ టూల్స్‌కు అప్‌లోడ్ చేయకపోవడమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగులను కఠినతరం చేసుకోవడం ద్వారా కొంతవరకు ముప్పును తగ్గించుకోవచ్చని వారు పేర్కొన్నారు.

వాటర్‌మార్క్‌లు ఉన్నా నమ్మకం లేదు!

తాము రూపొందించిన ఏఐ చిత్రాలపై 'సింథ్‌ఐడీ' అనే కంటికి కనిపించని డిజిటల్ వాటర్‌మార్క్‌ను ముద్రిస్తున్నట్లు గూగుల్ చెబుతోంది. దీనివల్ల ఏది ఏఐ చిత్రమో గుర్తించవచ్చని పేర్కొంటోంది. కానీ, ఈ వాటర్‌మార్క్‌లను గుర్తించే టూల్స్ సాధారణ ప్రజలకు అందుబాటులో లేవు. పైగా, ఇలాంటి వాటర్‌మార్క్‌లను సులభంగా తొలగించవచ్చని లేదా మార్చేయవచ్చని సైబర్ భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. "వాటర్‌మార్కింగ్ విధానం ఆశాజనకంగా ఉన్నప్పటికీ, దాన్ని సులభంగా ఫేక్ చేయవచ్చు. నిజ ప్రపంచంలో దీని ప్రభావం చాలా పరిమితం" అని రియాలిటీ డిఫెండర్ సీఈఓ బెన్ కోల్‌మన్ తెలిపారు. యూసీ బర్క్‌లీ ప్రొఫెసర్ హానీ ఫరిద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, వాటర్‌మార్కింగ్ మాత్రమే పూర్తిస్థాయి పరిష్కారం కాదని, అదనపు భద్రతా చర్యలు తప్పనిసరి అని అన్నారు.




More Telugu News