India vs Pakistan: బలవంతంగానే పాకిస్థాన్‌తో ఆడారు.. టీమిండియాపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Suresh Raina comments on India Pakistan Asia Cup match
  • పాక్‌తో ఆసియా కప్ మ్యాచ్ ఆడటం భారత ఆటగాళ్లకు ఇష్టం లేదన్న రైనా
  • బీసీసీఐ ఒప్పుకోవడం వల్లే ఆటగాళ్లు బలవంతంగా ఆడార‌ని
  • మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని టీమిండియా
  • పహల్గామ్ దాడి నేపథ్యంలోనే ఆటగాళ్లలో తీవ్ర వ్యతిరేకత
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కేవలం మైదానంలోనే కాదు, ఆటగాళ్ల మానసిక స్థితిలోనూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆడటం ఏ ఒక్క భారత ఆటగాడికి ఇష్టం లేదని, కేవలం బీసీసీఐ ఒత్తిడి వల్లే వారు బరిలోకి దిగారని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడి వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

'స్పోర్ట్స్ తక్‌'తో మాట్లాడుతూ రైనా ఈ కీలక విషయాలు వెల్లడించాడు. "నాకు తెలిసినంతవరకు, ఆటగాళ్లను వ్యక్తిగతంగా అడిగితే ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఆడటానికి ఎవరూ ఇష్టపడరు. బీసీసీఐ ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అంగీకరించడంతో వారు ఆడక తప్పలేదు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలను అడిగితే, వారు పాకిస్థాన్‌తో ఆడేందుకు నిరాకరించేవారని నేను కచ్చితంగా చెప్పగలను" అని రైనా పేర్కొన్నాడు.

ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన 'ఆపరేషన్ సిందూర్' ఘటనలతో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు ఈ ఏడాది ఆసియా కప్ జరుగుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ, బీసీసీఐతో పాటు ఇతర బోర్డులు టోర్నమెంట్‌ను కొనసాగించాలని నిర్ణయించాయి.

భారత్, పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినా, భారత జట్టు అన్నింటినీ పక్కనపెట్టి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి, పహల్గామ్ దాడి బాధితులకు తమ విజయం ద్వారా సంఘీభావం ప్రకటించింది. అంతేకాకుండా మ్యాచ్ ముగిశాక పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా భారత ఆటగాళ్లు నిరాకరించడం గమనార్హం. ఇది ముందుగా తీసుకున్న నిర్ణయమేనని సమాచారం.
India vs Pakistan
Suresh Raina
Asia Cup 2025
BCCI
Pahalgam attack
Operation Sindoor
Indian cricket team
Suryakumar Yadav
cricket controversy
sports news

More Telugu News