Duleep Trophy 2025: 11 ఏళ్ల నిరీక్షణకు తెర.. దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్

Central Zone beats South by six wickets to secure title of Duleep Trophy 2025
  • ఫైనల్లో సౌత్ జోన్‌పై 6 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం
  • 65 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో నాలుగు వికెట్లు కోల్పోయిన సెంట్రల్
  • ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా యశ్ రాథోడ్, సిరీస్‌ హీరోగా సారాంశ్ జైన్
  • కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌కు ఈ ఏడాది ఇది రెండో మేజర్ ట్రోఫీ
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సెంట్రల్ జోన్ దులీప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సోమవారం ముగిసిన ఫైనల్లో సౌత్ జోన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, 11 ఏళ్ల తర్వాత టైటిల్‌ను ముద్దాడింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 65 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదన ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.

ఐదో రోజు పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో స్వల్ప లక్ష్య ఛేదన సెంట్రల్ జోన్‌కు అంత సులువు కాలేదు. సౌత్ జోన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సెంట్రల్ బ్యాటర్లను పరీక్షించారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంకిత్ శర్మ, పేసర్ గుర్జప్నీత్ సింగ్ చెలరేగడంతో సెంట్రల్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. డానిశ్‌ మలేవార్ (5), కెప్టెన్ రజత్ పాటిదార్, శుభమ్ శర్మ, సారాంశ్ జైన్‌లు త్వరగా ఔటవ్వడంతో సెంట్రల్ క్యాంపులో కాస్త ఆందోళన నెలకొంది.

అయితే, ఈ క్లిష్ట సమయంలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశ్ రాథోడ్ (13 నాటౌట్), అక్షయ్ వాడ్కర్ (19 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. 20.3 ఓవర్లలో సెంట్రల్ జోన్ 4 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి, ఏడోసారి దులీప్ ట్రోఫీని గెలుచుకుంది.

మ్యాచ్ అనంతరం సెంట్రల్ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. "ట్రోఫీలు గెలవడం ఏ కెప్టెన్‌కైనా సంతోషాన్నిస్తుంది. మా ఆటగాళ్లు టోర్నీ అంతటా గొప్ప పోరాట పటిమ చూపించారు. పిచ్ పొడిగా ఉండటంతోనే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం" అని తెలిపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్ టైటిల్ అందించిన పాటిదార్‌కు ఈ ఏడాది ఇది రెండో పెద్ద ట్రోఫీ.

సౌత్ జోన్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ.. "ఈ అనుభవం నుంచి ఎంతో నేర్చుకుంటాం. రెండో ఇన్నింగ్స్‌లో మేం బాగా పోరాడాం. అంత సులభంగా ఓటమిని అంగీకరించనందుకు సంతోషంగా ఉంది" అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో యశ్ రాథోడ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', సారాంశ్ జైన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు దక్కాయి.
Duleep Trophy 2025
Rajat Patidar
Duleep Trophy
Central Zone
South Zone
Yash Rathod
Saransh Jain
BCCI
Cricket
Indian Cricket
Domestic Cricket

More Telugu News