Gautam Gambhir: పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ వద్దు.. తెర వెనుక గంభీర్ మాస్టర్ ప్లాన్!

Gautam Gambhir Master Plan No Shake Hands With Pak Players
  • ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
  • మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించిన టీమిండియా
  • పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ కఠిన నిర్ణయం
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఘన విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు కంటే మ్యాచ్ అనంతరం జరిగిన ఘటనే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. విజయం తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో గానీ, ఇతర పాక్ ఆటగాళ్లతో గానీ కరచాలనం (షేక్ హ్యాండ్) చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు సూత్రధారి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని తెలుస్తోంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాక్ జట్టుకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే మైదానం వీడారు. ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు భారత డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లగా, వారి ముఖంపైనే తలుపులు మూసివేయడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ పరిణామంపై ప్రజెంటేషన్ కార్యక్రమంలో కెప్టెన్ సూర్యకుమార్‌ను ప్రశ్నించగా, పహల్గామ్ ఉగ్రదాడికి బలమైన సందేశం పంపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఈ ఆలోచన కెప్టెన్‌ది కాదని, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌దేనని ‘టెలికామ్ ఆసియా స్పోర్ట్’ నివేదిక వెల్లడించింది. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లతో మాట్లాడిన గంభీర్, పాక్ ఆటగాళ్లతో ఎలాంటి మాటలు కలపవద్దని, కరచాలనం కూడా చేయవద్దని గట్టిగా సూచించినట్లు ఆ నివేదిక పేర్కొంది. "సోషల్ మీడియాను, బయటి గోలను పట్టించుకోకండి. మీ పని దేశం కోసం ఆడటం. పహల్గామ్‌లో ఏం జరిగిందో మర్చిపోవద్దు. షేక్ హ్యాండ్ వద్దు, మాటలు వద్దు. మైదానంలోకి వెళ్లి మీ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి భారత్‌ను గెలిపించండి" అని గంభీర్ ఆటగాళ్లతో అన్నట్లు సమాచారం.

ఈ విషయంపై ఆసియా కప్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన గంభీర్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. "ఇది మంచి విజయం. పహల్గామ్ దాడి బాధితులకు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలపాలనుకున్నాం. అందుకే ఈ మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం చేసిన భారత సైన్యానికి మా ధన్యవాదాలు. దేశం గర్వపడేలా చేసేందుకు ప్రయత్నిస్తాం" అని ఆయన వివరించారు. 
Gautam Gambhir
India vs Pakistan
Asia Cup 2025
Suryakumar Yadav
Pahalgam attack
India cricket team
Pakistan cricket team
Operation Sindoor
Cricket

More Telugu News