AP Mega DSC: మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల.. మంత్రి లోకేశ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

AP Mega DSC Final Selection List Out Lokesh Key Announcement
  • 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి
  • అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న తుది జాబితా
  • ఇచ్చిన హామీ నెరవేర్చామన్న మంత్రి నారా లోకేశ్
  • ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేసిన ప్రభుత్వం
  • ఈసారి రానివారు నిరుత్సాహ పడొద్దని లోకేశ్ సూచన
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ-2025 తుది ఎంపిక జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన మెగా డీఎస్సీ హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. "ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. ఈసారి అవకాశం రాని అభ్యర్థులు నిరాశ చెందవద్దు. మళ్లీ ప్రయత్నించాలి" అని సూచించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, పురపాలక, గిరిజన సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని ఖాళీల భర్తీకి ఈ ప్రక్రియ చేపట్టారు. మే 15 వరకు దరఖాస్తులను స్వీకరించగా, మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు షిఫ్టులలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించామని తెలిపారు. జులై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న తుది కీ విడుదల చేశామన్నారు. టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇచ్చి, ఏడు దశల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశాకే తుది జాబితాను రూపొందించినట్లు ఆయన వివరించారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://apdsc.apcfss.in/SelectionList వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
AP Mega DSC
Nara Lokesh
Teachers Recruitment
Andhra Pradesh Education
AP Government Jobs
Venkata Krishna Reddy
AP DSC Selection List
Teacher Jobs
Education Department

More Telugu News