: కారును ఢీ కొట్టాడని డ్రైవర్ కిడ్నాప్.. పూజా ఖేడ్కర్ పై మరో కేసు

  • మాజీ ఐఏఎస్ ఇంట్లో బంధించిన డ్రైవర్ ను రక్షించిన పోలీసులు
  • నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్ కు ఎంపికైన పూజ ఖేడ్కర్.. ఉద్యోగంలో నుంచి తొలగించిన కేంద్రం
  • తనను తొలగించే అధికారం లేదంటూ కోర్టుకెక్కిన పూజ
మహారాష్ట్రకు చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తన కారును ఢీ కొట్టాడనే కోపంతో ఓ డ్రైవర్ ను తన ఇంట్లోని ఓ గదిలో బంధించిందని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదుతో పూజా ఖేడ్కర్ పై కిడ్నాప్ కేసు పెట్టారు. నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్ కు ఎంపికైన పూజా ఖేడ్కర్ ను కేంద్రం ఇప్పటికే ఉద్యోగంలో నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు.

కారును ఢీ కొట్టిన మిక్సర్ ట్రక్..
ఇటీవల నవీ ముంబైలో ఓ కాంక్రీట్ మిక్సర్ ట్రక్ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఆ తర్వాత మిక్సర్ ట్రక్ డ్రైవర్ కనిపించకుండా పోయాడు. డ్రైవర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. సదరు ప్రమాదానికి గురైన కారును పూజా ఖేడ్కర్ ఇంటి ఆవరణలో గుర్తించారు. కారును పరిశీలించి, యజమానిని ప్రశ్నించేందుకు వెళ్లిన పోలీసుల పట్ల పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ అనుచితంగా ప్రవర్తించారు.

అసభ్య పదజాలంతో దూషిస్తూ గేటు తీసేందుకు నిరాకరించారు. కాసేపటి తర్వాత బలవంతంగా గేటు తెరిచి లోపలికి వెళ్లిన పోలీసులు ఇంట్లోని ఓ గదిలో బంధించిన మిక్సర్ ట్రక్ డ్రైవర్ ను గుర్తించి విడిపించారు. ఈ ఘటనపై పూజా ఖేడ్కర్ మీద కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విధి నిర్వహణకు అడ్డుతగిలిన మనోరమ ఖేడ్కర్ కు సమన్లు పంపి విచారణకు పిలిచారు.

More Telugu News