Tirumala: తిరుమల, విశాఖ ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ ఖ్యాతి

Tirumala and Visakhapatnam Erra Matti Dibbalu get International recognition
  • యునెస్కో తాత్కాలిక జాబితాలో తిరుమల, ఎర్రమట్టి దిబ్బలు
  •  ప్రపంచ వారసత్వ గుర్తింపు దిశగా కీలక ముందడుగు
  •  భారత్ నుంచి మొత్తం ఏడు ప్రదేశాలకు చోటు
  •  జాబితాలో డెక్కన్ ట్రాప్స్, మేఘాలయ గుహలు కూడా
  •  ఎక్స్ వేదికగా ప్రకటించిన భారత ప్రతినిధి బృందం
ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రఖ్యాత సహజ సంపదలకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కే అవకాశం ఏర్పడింది. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల కొండలు, విశాఖపట్నంలోని ఎర్రమట్టి దిబ్బలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఇది ప్రపంచ వారసత్వ హోదాను సాధించే దిశగా ఒక కీలకమైన ముందడుగు.

భారత్ నుంచి మొత్తం ఏడు సహజ వారసత్వ ప్రదేశాలను యునెస్కో తన తాత్కాలిక జాబితాలో చేర్చినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ రెండు ప్రదేశాలు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందనున్నాయి.

ఈ జాబితాలో ఏపీకి చెందిన ప్రదేశాలతో పాటు, మహారాష్ట్రలోని పాంచని-మహాబలేశ్వర్‌లోని డెక్కన్ ట్రాప్స్, కర్ణాటకలోని ఉడుపిలోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్, మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు ఉన్నాయి. అలాగే, నాగాలాండ్‌లోని నాగా హిల్ ఓఫియోలైట్, కేరళలోని వర్కాల క్లిఫ్ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నాయని అధికారులు తెలిపారు. తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవడం ప్రపంచ వారసత్వ హోదా పొందడంలో మొదటి, కీలకమైన అడుగుగా భావిస్తారు.
Tirumala
Tirumala hills
Visakhapatnam Erra Matti Dibbalu
Erra Matti Dibbalu
UNESCO world heritage
Andhra Pradesh Tourism
Natural heritage sites India
World Heritage Sites
Tourism Andhra Pradesh
AP Tourism

More Telugu News