Sushila Karki: నిరసనల్లో మరణించిన ఆందోళనకారులకు అమరవీరుల హోదా.. నేపాల్ నూతన ప్రధాని

Sushila Karki Nepal PM to Investigate Protest Violence
  • నేపాల్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కర్కి
  • జెన్-జీ యువత ఉద్యమంతో కుప్పకూలిన ఓలీ ప్రభుత్వం
  • కేవలం ఆరు నెలలు మాత్రమే అధికారంలో ఉంటామని స్పష్టం
  • దేశ పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి
  • విధ్వంస ఘటనలపై విచారణ జరిపిస్తామని వెల్లడి
జెన్-జీ (జడ్) యువత చేపట్టిన భారీ ఆందోళనల కారణంగా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలిన కొన్ని రోజులకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి తాజాగా కీలక ప్రకటనలు చేశారు. తమ ప్రభుత్వం కేవలం ఆరు నెలల పాటే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సుశీల కర్కి మాట్లాడుతూ "నేను గానీ, నా బృందం గానీ అధికారాన్ని రుచి చూడటానికి ఇక్కడికి రాలేదు. ప్రజలకు సేవ చేయడానికే బాధ్యతలు చేపట్టాం. ఆరు నెలలకు మించి ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగం. కొత్తగా ఎన్నికయ్యే పార్లమెంటుకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తాం" అని తెలిపారు. దేశ పునర్నిర్మాణానికి ప్రజలందరి సహకారం అవసరమని, వారి మద్దతు లేకుండా తాము విజయం సాధించలేమని అన్నారు.

ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా ‘అమరవీరులు’గా గుర్తిస్తామని కర్కి హామీ ఇచ్చారు. ఇది ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నారు. అదే సమయంలో నిరసనల సందర్భంగా జరిగిన విధ్వంసకర ఘటనలపై విచారణ జరిపిస్తామని ఆమె స్పష్టం చేశారు. అధికారం కోసం కాకుండా దేశాన్ని తిరిగి గాడిన పెట్టడానికే తాము వచ్చామని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నేపాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Sushila Karki
Nepal
Nepal Prime Minister
Supreme Court
Political Protest
Government
Martyr Status
Youth Protest
KP Sharma Oli
Nepal Politics

More Telugu News