ఆ సినిమాతో రూ.200 కోట్లు నష్టపోయా.. ఆమిర్ ఖాన్

  • అతి నమ్మకంతో అపజయం మూటగట్టుకున్నా
  • లాల్‌ సింగ్‌ చడ్డా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని వెల్లడి
  • చైనాలో తీసిన సీక్వెన్స్ ఫైనల్ కట్ లో తీసేయాల్సి వచ్చింది..
  • దీంతో దానికోసం పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైందన్న నటుడు
సినిమా బడ్జెట్ విషయంలో.. అదీ తాను నిర్మించే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని బాలీవుడ్ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. అయితే, లాల్ సింగ్ చడ్డా సినిమా విషయంలో అతి నమ్మకంతో ముందుకెళ్లడంతో దెబ్బతిన్నానని తెలిపారు. ఈ సినిమా తనకు రూ.200 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. లాల్ సింగ్ చడ్డా సినిమా విషయంలో తన అంచనాలు తప్పాయని, తాను ఆశించినంతగా అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పారు.

నష్టాలు రావొద్దని జాగ్రత్తలు..
‘‘నిర్మాతగా జాగ్రత్తగా ఉండడం నాకు అలవాటు. కథకు అవసరమైన దాన్నే ఎంపిక చేసుకుంటా. ఓ సినిమా నిర్మాణం ప్రారంభించే ముందు నేను ఆలోచించే విషయం ఒకటే.. ఈ సినిమా వల్ల నష్టాలు రాకూడదు. అలా రాకుండా చూడడమే నా ప్రథమ కర్తవ్యం. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమా విషయంలో అతినమ్మకం నా అంచనాలను దెబ్బకొట్టింది. అప్పటివరకూ నా సినిమాలన్నీ హిట్‌.. అదే నమ్మకం ఈ సినిమాపైనా పెట్టుకున్నా. కానీ, నా అంచనా తప్పింది. బడ్జెట్‌ విషయంలో పరిమితి పాటించకపోవడంతో రూ.200 కోట్లు నష్టపోయా’’

కనీసం 100 నుంచి 200 కోట్లు ఆశించా..
దంగల్‌ సినిమాకు ఇండియాలో రూ.385 కోట్లు రావడంతో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమాకు కనీసం రూ.100-200 కోట్లు వస్తాయని భావించినట్లు ఆమిర్ తెలిపారు. అందుకు అనుగుణంగా బడ్జెట్‌ ప్లాన్ చేసుకుని నిర్మాణం మొదలుపెట్టినట్లు వివరించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్ చేయాల్సి వచ్చిందని, బడ్జెట్ లో ఎక్కువ మొత్తం ప్రయాణాలకే ఖర్చయిందని చెప్పారు.

ఆ సీక్వెన్స్ కోసం పెట్టిన ఖర్చంతా వృథా..
చైనాలో తెరకెక్కించిన టేబుల్‌ టెన్నిస్‌ సీక్వెన్స్‌ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని, తీరా సినిమా ఫైనల్ కట్ లో ఆ సీక్వెన్స్ తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందన్నారు. కరోనా తర్వాత పెరిగిపోయిన మేకింగ్‌ ఖర్చు కూడా తన సినిమాపై ప్రభావం చూపిందని ఆమిర్ చెప్పారు. కాగా, ‘లాల్‌ సింగ్‌ చడ్డా’లో ఆమిర్ ఖాన్ లీడ్ రోల్ చేయగా.. నాగచైతన్య, కరీనా కపూర్‌, మోనా సింగ్‌, మానవ్‌ విజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.


More Telugu News