Turakapalem: తురకపాలెం జలాల్లో యురేనియం అవశేషాలు .. చెన్నై ప్రయోగశాల నివేదికలో వెల్లడి

Turakapalem Water Shows Uranium Residue Chennai Lab Report
  • నీటిలో యురేనియం, స్ట్రాన్షియం, ఈకొలి బ్యాక్టీరియా ఉన్నాయంటున్న చెన్నై నిపుణులు
  • క్వారీ గుంతల్లోని నీటిని తాగునీటిగా వినియోగించడం వల్లే ఈ పరిస్థితి అంటున్న అధికారులు
  • నీటిలో ఈకొలి బ్యాక్టీరియా స్పష్టంగా ఉన్నట్లు పేర్కొన్న నిపుణులు
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో ఇటీవల వెలుగు చూసిన అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం తాగునీటిలో యురేనియం అవశేషాలు ఉండటమేనని అధికారులు నిర్ధారించారు. గ్రామస్థుల ఆరోగ్యంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో, ప్రభుత్వం నియమించిన వైద్య, శాస్త్రవేత్తల బృందం నీరు, మట్టి, రక్త నమూనాలను సేకరించి సమగ్ర అధ్యయనం చేపట్టింది.

ఈ క్రమంలో నీటి నమూనాలను చెన్నై, ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ వంటి ప్రతిష్టాత్మక ప్రయోగశాలలకు పంపారు. చెన్నై ప్రయోగశాల విడుదల చేసిన నివేదిక ప్రకారం, తురకపాలెం పరిసర ప్రాంతాల్లోని నీటిలో యురేనియం, స్ట్రాన్షియం, ఈకొలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఇది గ్రామస్తుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్వారీ గుంతలే మూలమా?

తురకపాలెం చుట్టూ రాళ్ల క్వారీలు ఎక్కువగా ఉండటం, వాటిలో స్థానికులు పనిచేయడం, వాటి నుంచి ఏర్పడిన గుంతల్లోని నీటిని తాగునీటిగా వినియోగించడం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు భావిస్తున్నారు.

చెన్నై, స్థానిక నివేదికల మధ్య భిన్నత

గ్రామంలో తొలుత సేకరించిన నీటి నమూనాలలో బ్యాక్టీరియా ఆనవాళ్లు పెద్దగా కనిపించలేదని అధికారులు ప్రకటించారు. అయితే, చెన్నై నివేదికలో మాత్రం ఈకొలి బ్యాక్టీరియా స్పష్టంగా ఉన్నట్లు తేలింది. ఈ భిన్నతపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

యురేనియం ప్రమాదాలు - వైద్యుల హెచ్చరిక

వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం, యురేనియం శరీరానికి అత్యంత హానికరమైనది. ఇది తాగునీరు, ఆహారం ద్వారా శరీరంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. చర్మ సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలకు ప్రమాదం వాటిల్లవచ్చు. తీవ్రమైతే ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. 
Turakapalem
Turakapalem uranium
Guntur district
uranium contamination
water contamination
E coli bacteria
health issues
Andhra Pradesh news
groundwater pollution
quarrying impact

More Telugu News