Bhatti Vikramarka: ఫీజు బకాయిలపై చేతులెత్తేసిన ప్రభుత్వం.. కాలేజీల బంద్‌కు రంగం సిద్ధం?

Telangana Government Expresses Inability to Pay Fee Reimbursement
  • ఖజానాలో పైసా కూడా లేదని తేల్చిచెప్పిన డిప్యూటీ సీఎం భట్టి
  • జీతాలు, సంక్షేమ పథకాలకే నిధులు సరిపోతున్నాయని వ్యాఖ్య
  • విడతల వారీగా చెల్లిస్తామని సర్దిచెప్పిన మంత్రి శ్రీధర్‌బాబు
  • సోమవారం నుంచి బంద్‌పై నేడు యాజమాన్యాల తుది నిర్ణయం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఆందోళన బాట పట్టిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీగా ఉందని, బకాయిలు చెల్లించేందుకు ఒక్క పైసా కూడా లేదని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు. దీంతో సోమవారం నుంచి తలపెట్టిన కాలేజీల బంద్‌ అనివార్యంగా కనిపిస్తోంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. మొత్తం రూ.3,500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, కనీసం టోకెన్లు జారీ అయిన రూ.1200 కోట్లనైనా వెంటనే విడుదల చేస్తే సమ్మె విరమించుకుంటామని వారు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

అయితే, యాజమాన్యాల విజ్ఞప్తిపై భట్టి విక్రమార్క తీవ్ర నిస్సహాయత వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘‘ప్రభుత్వానికి వస్తున్న డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, ఇతర సంక్షేమ పథకాలకే పోతున్నాయి. ఇక ఖజానాలో మిగిలిందేమీ లేదు. రీయింబర్స్‌మెంట్‌పై నేనేం చేయలేను. మీకు ఇచ్చేందుకు పైసా కూడా లేదు. నన్నేం చేయమంటారో మీరే చెప్పండి’’ అని ఆయన అన్నట్టు తెలిసింది. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో యాజమాన్యాల ప్రతినిధులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

అనంతరం వారు సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేంద‌ర్‌‌రెడ్డితో వేర్వేరుగా సమావేశమయ్యారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నామని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. ఇది పెద్ద మొత్తంతో కూడుకున్న అంశం కాబట్టి క్రమంగా పరిష్కరిస్తామని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు. బకాయిలను విడతలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వేం నరేందర్‌‌రెడ్డి తెలిపారు.

ప్రభుత్వం నుంచి భిన్నమైన స్పందనలు రావడంతో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కాలేజీల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. మంత్రులతో జరిగిన చర్చల సారాంశాన్ని విశ్లేషించి, బంద్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు నేడు మాసబ్‌ట్యాంక్‌లోని ఫైన్‌ ఆర్ట్స్ యూనివర్సిటీలో సమావేశం కానున్నట్టు యాజమాన్యాల సమాఖ్య నేతలు ఎన్.రమేశ్ బాబు, కేఎస్ రవికుమార్, కె.సునీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Bhatti Vikramarka
Telangana
fee reimbursement
private colleges
college bandh
Sridhar Babu
Vem Narender Reddy
education
Telangana government

More Telugu News