Sikh woman: యూకేలో సిక్కు యువతిపై అత్యాచారం... "మీ దేశం వెళ్లిపో" అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు

Sikh Woman Raped in UK Racist Attack
  • యూకేలో భారత సంతతి సిక్కు యువతిపై లైంగిక దాడి
  • అనంతరం జాత్యాహంకార వ్యాఖ్యలు
  • ఓల్డ్‌బరీ పట్టణంలో ఇద్దరు శ్వేతజాతీయుల అఘాయిత్యం
  • పెరిగిపోతున్న జాత్యాహంకార దాడులపై తీవ్ర ఆందోళన
  • ఘటనను తీవ్రంగా ఖండించిన బ్రిటన్ ఎంపీలు
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో భారత సంతతి ప్రజలపై జాత్యాహంకార దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓల్డ్‌బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడి, జాతి వివక్ష వ్యాఖ్యలతో దాడి చేసిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానిక సిక్కు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

వివరాల్లోకి వెళితే, గత మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఓల్డ్‌బరీలోని టేమ్ రోడ్ సమీపంలో ఈ దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, "మీ దేశానికి తిరిగి వెళ్లిపో" అంటూ జాత్యాహంకార వ్యాఖ్యలతో దూషించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దీనిని 'జాతి వివక్షతో కూడిన దాడి'గా పరిగణిస్తున్నామని తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులిద్దరూ శ్వేతజాతీయులని, వారిలో ఒకరు గుండుతో ముదురు రంగు స్వెట్‌షర్ట్ ధరించి ఉండగా, మరొకరు బూడిద రంగు టాప్ వేసుకుని ఉన్నారని బాధితురాలు తెలిపింది. సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలతో నిందితుల కోసం గాలిస్తున్నామని, వారిని పట్టుకోవడానికి ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక సిక్కు సమాజం నుంచి వెల్లువెత్తుతున్న ఆగ్రహం అర్థం చేసుకోదగినదేనని, ఆ ప్రాంతంలో గస్తీ పెంచుతామని ఓ సీనియర్ పోలీస్ అధికారి హామీ ఇచ్చారు.

ఈ అమానుష ఘటనను బ్రిటన్ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ మాట్లాడుతూ.. "ఇది అత్యంత హింసాత్మక చర్య. 'మీరు ఈ దేశానికి చెందిన వారు కాదు' అని బాధితురాలితో అనడం దారుణం. కానీ ఆమె ఇక్కడికి చెందినవారే. ప్రతీ సమాజానికి సురక్షితంగా, గౌరవంగా జీవించే హక్కు ఉంది" అని పేర్కొన్నారు. మరో ఎంపీ జస్ అత్వాల్ స్పందిస్తూ, "దేశంలో పెరుగుతున్న జాతి వివక్ష ఉద్రిక్తతల ఫలితమే ఈ హేయమైన దాడి. దీనివల్ల ఓ యువతి జీవితాంతం మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, నెల రోజుల క్రితం వోల్వర్‌హాంప్టన్‌లో ఇద్దరు వృద్ధ సిక్కులపై ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటన మరువక ముందే ఈ దారుణం జరగడం గమనార్హం.
Sikh woman
UK
United Kingdom
racist attack
sexual assault
Oldbury
Preet Kaur Gill
hate crime
Jas Atwal
Indian origin

More Telugu News