Sai Tej: సోషల్ మీడియాలో పిల్లల భద్రత... హీరో సాయి దుర్గా తేజ్ కీలక సూచన

Sai Tej Advocates Aadhar Linking for Child Social Media Accounts
  • హైదరాబాద్‌లో 'అభయం మసూమ్-25' సదస్సు
  • పిల్లల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలకు ఆధార్ లింక్ చేయాలన్న సాయి తేజ్ 
  • సోషల్ మీడియాలో చిన్నారుల ఫోటోలు, వీడియోల దుర్వినియోగాన్ని అరికట్టాలని పిలుపు 
సోషల్ మీడియాలో చిన్నారుల భద్రతపై మెగా హీరో సాయి దుర్గ తేజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ఖాతాలకు ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. దీనివల్ల ఆన్‌లైన్‌లో వారి ఫోటోలు, వీడియోల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లో జరిగిన 'అభయం మసూమ్-25' సదస్సులో పాల్గొన్న సందర్భంగా సాయి తేజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం పట్ల తల్లిదండ్రులకు తాను గతంలోనే హెచ్చరిక చేశానని గుర్తుచేశారు. "నిజ జీవితం వేరుగా ఉంటుంది. మీరు సరదాగా పెట్టే పిల్లల ఫోటోలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

చిన్నారులపై అశ్లీలతతో కూడిన అనైతిక వ్యాఖ్యలు చేసే వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇలాంటి కామెంట్లు చేసేవారికి భవిష్యత్తులో పిల్లలు పుట్టరా? వారి సొంత పిల్లలు, బంధువులు లేదా స్నేహితుల పిల్లలపై ఇలాంటి వ్యాఖ్యలు వస్తే ఊరుకుంటారా? వీరికి కనీస నైతిక విలువలు లేవా?" అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. వందల మంది ఇలాంటి వ్యాఖ్యలను లైక్ చేయడం, కామెంట్ చేయడం చూసి తాను చాలా నిరాశకు గురైనట్లు తెలిపారు.

ఈ విషయంపై సమాజం నుంచి గానీ, మీడియా నుంచి గానీ 24 గంటలు ఎదురుచూసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో, తానే బాధ్యత తీసుకున్నానని సాయి తేజ్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఉన్నత పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు వివరించారు. ఇలాంటి అనైతిక ప్రవర్తనను 'డార్క్ కామెడీ' అని చెప్పి సమర్థించుకోవడం సరికాదని, ఇది ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలపై చిన్నారుల భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు
Sai Tej
Sai Durga Tej
social media safety
children safety
Aadhar linking
cybercrime
online abuse
Abhayam Masoom 25
child protection
social media regulation

More Telugu News