JP Nadda: విశాఖలో జరగనున్న సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP Nadda BJP National President to Visit Visakhapatnam
  • విశాఖ ఉక్కు పరిశ్రమపై అపోహలు సృష్టిస్తున్నారని మాధవ్ మండిపాటు
  • ప్రైవేటీకరణను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్న మాధవ్
  • మూడు రాజధానుల పేరుతో జగన్ డ్రామాలాడారని విమర్శ
విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కొందరు పనిగట్టుకొని అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ పురోభివృద్ధి సాధిస్తోందని, ఈ మంచి విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలోని రైల్వే మైదానంలో ‘సారథ్యం’ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. కడప నుంచి ప్రారంభమైన సారథ్యం యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంపై పీవీఎన్ మాధవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి డ్రామాలాడి, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం మైనార్టీల నిధులను కూడా దారి మళ్లించిందని ఆరోపించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వామపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ప్రైవేటీకరణను ఒక భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ఇది అన్ని దేశాల్లోనూ జరుగుతున్న ప్రక్రియేనని అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని తొలుత కోరింది బీజేపీయేనని ఆయన గుర్తుచేశారు.

ఎన్డీఏ సారథ్యంలో పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణం పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని మాధవ్ తెలిపారు. అలాగే, ఈ నెల 17వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారని ఆయన వెల్లడించారు.
JP Nadda
BJP
Visakha Steel Plant
PVN Madhav
Andhra Pradesh
Visakhapatnam
Saradhyam Yatra
Privatization
Nirmala Sitharaman
Polavaram Project

More Telugu News