Roja: పవన్ కల్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డ రోజా

Roja Criticizes Pawan Kalyan Again
  • ఎన్డీయే ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్న రోజా
  • సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శ
  • పవన్ కల్యాణ్‌కు ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్య
  • మంత్రులు చూపిస్తున్న మెడికల్ కాలేజీల వీడియోలు నకిలీవన్న రోజా
  • ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపాటు
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని, అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో మంత్రులు చేస్తున్న ప్రచారాన్ని రోజా తప్పుబట్టారు. మంత్రులు చూపిస్తున్న వీడియోలు నిజమైనవి కావని, అవన్నీ ఫేక్ అని ఆరోపించారు. హోంమంత్రి అనిత మెడికల్ కాలేజీలపై చూపించింది ప్రజెంటేషన్ కాదని, అది ఆమె ఫ్రస్టేషన్ అని ఎద్దేవా చేశారు. "చంద్రబాబు ఇచ్చిన ఫేక్ వీడియోలతో మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారికి దమ్ముంటే నాతో పాటు వస్తే నిజమైన మెడికల్ కాలేజీలను చూపిస్తాను" అని సవాల్ విసిరారు. చంద్రబాబు తన సుదీర్ఘ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని ఆమె గుర్తుచేశారు.

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సమస్యలు పరిష్కరిస్తారని ఓట్లు వేస్తే, పవన్ మాత్రం సినిమా షూటింగులు చేసుకుంటూ, ప్రభుత్వ ధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలి, ప్యాకేజీల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. "ఆయనకు ఓటు వేసినందుకు ప్రజలు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు" అని అన్నారు.

ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు. లోకేశ్ మెప్పు పొందడం కోసమే మంత్రులు సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. జగన్ బెంగళూరులో ఉన్నారని విమర్శిస్తున్న టీడీపీ, జనసేన నేతలు.. గతంలో వారు ఓడిపోయినప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
Roja
RK Roja
YS Jagan
Pawan Kalyan
Chandrababu Naidu
Andhra Pradesh politics
YSRCP
Super Six promises
Medical colleges Andhra Pradesh
Andhra Pradesh government

More Telugu News