కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్!

  • జ్వరంతో బాధపడుతున్న తొమ్మిది మందికి పరీక్షలు
  • నలుగురికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో వైద్యులు అలర్ట్
  • పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో వెలుగు చూసిన మెలియాయిడోసిస్ కేసులు ప్రస్తుతం చేబ్రోలు మండలంలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. మెలియాయిడోసిస్ బాధితులు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చల్లా సీతారామిరెడ్డి మరణించారు. దీంతో వైద్యాధికారులు కొత్తరెడ్డిపాలెం గ్రామంపైనా దృష్టిసారించారు. ఇటీవల జ్వరం బాధిత పడిన తొమ్మిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. నలుగురిలో కొకై రకం బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయని చెప్పారు. దీంతో వారికి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 12న చేబ్రోలుకు చెందిన ఆశా వర్కర్ సులోచన కూడా జ్వరం, ఉబ్బసం లక్షణాలతో మృతి చెందారు. సులోచన వయసు 45 ఏళ్లే కావడం, జ్వరంతో మరణించడంపై అనుమానాలు వస్తున్నాయి. దీంతో ఆమెకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదికల్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రామంలో అనారోగ్యం బారిన పడిన వారికి చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వారు కోలుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, కొత్తరెడ్డిపాలెంలో ఫీవర్ కేసులు అధికంగా వస్తున్నాయని చేబ్రోలు పీహెచ్‌సీ వైద్యురాలు ఊర్మిళ తెలిపారు. తొమ్మిది మందికి బ్లడ్ కల్చర్ టెస్టు చేయగా ఐదుగురిలో స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్‌గా తేలిందని వివరించారు. మరో కేసులో మెలియాయిడోసిస్ కేసుగా అనుమానాలున్నాయని పేర్కొన్నారు.


More Telugu News