S Narayan: ప్రముఖ కన్నడ దర్శకుడిపై కోడలి సంచలన ఆరోపణలు.. వరకట్న వేధింపుల కేసు నమోదు

Dowry Case Filed Against Kannada Director S Narayan and Family
  • కన్నడ దర్శకుడు ఎస్. నారాయణ్‌పై కేసు
  • వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ కోడలు పవిత్ర ఫిర్యాదు
  • ఫిర్యాదులో నారాయణ్ భార్య, కొడుకు పేర్లు కూడా
ప్రముఖ కన్నడ సినీ దర్శకుడు, నటుడు ఎస్. నారాయణ్, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వరకట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ఆయన కోడలు పవిత్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పవిత్ర ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్. నారాయణ్, ఆయన భార్య భాగ్యవతి, కుమారుడు పవన్‌పై కేసు నమోదు చేశారు.

బెంగళూరులోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో పవిత్ర ఈ ఫిర్యాదు చేశారు. 2021లో పవన్‌తో తన వివాహం జరిగిందని, పెళ్లి సమయంలో కట్నం ఇచ్చినా అదనపు డబ్బు కోసం అత్తమామలు, భర్త వేధించడం మొదలుపెట్టారని ఆమె ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. తన భర్త పవన్ నిరుద్యోగిగా ఇంట్లోనే ఉంటుండగా, ఇంటి ఖర్చులన్నీ తానే చూసుకునేదాన్నని ఆమె వివరించారు.

ఈ క్రమంలో 'కళా సామ్రాట్ టీమ్ అకాడమీ' పేరుతో ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించడానికి పవన్ తనను డబ్బు డిమాండ్ చేసినట్లు పవిత్ర ఆరోపించారు. దాని కోసం తన తల్లి బంగారు నగలను తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చానని తెలిపారు. అయితే, ఆ అకాడమీ నష్టాల్లో కూరుకుపోయి మూతపడిందని... ఆ తర్వాత కూడా వేధింపులు ఆగలేదని, తన భర్త కోసం రూ.10 లక్షల లోన్ కూడా ఇప్పించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు తనను చిత్రహింసలు పెట్టి ఇంటి నుంచి గెంటేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పవిత్ర ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 85తో పాటు, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్. నారాయణ్ కన్నడలో ‘అనురాగద అలెగలు’, ‘మేఘ మాలె’, ‘తవరిన తొట్టిలు’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.
S Narayan
S Narayan dowry case
Kannada director
Pavitra
dowry harassment
Bangalore police
Kannada film industry
domestic violence
Kala Samrat Team Academy
Section 85 BNS

More Telugu News