SVN Bhatti: ‘ఊరికే ఎక్కువ చెబితే వాయిదా వేస్తా’.. పిటిషనర్‌ను తెలుగులో హెచ్చరించిన సుప్రీం జడ్జి

SVN Bhatti Warns Petitioner in Telugu in Supreme Court
  • సుప్రీంకోర్టులో మరోసారి వినిపించిన తెలుగు మాటలు
  • కాకినాడ దంపతుల విడాకుల కేసు విచారణ
  • భార్యాభర్తలతో తెలుగులో మాట్లాడిన జస్టిస్ ఎస్వీఎన్ భట్టి
  • కుమారుడి కోసం రూ.45 లక్షల సెటిల్‌మెంట్‌కు అంగీకారం
  • భారతీయ తల్లుల గురించి జస్టిస్ భట్టి కీలక వ్యాఖ్యలు
  • జంటకు విడాకుల మంజూరు
  • పాస్‌పోర్ట్ తిరిగివ్వాలని అధికారులకు ఆదేశం 
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చాలాకాలం తర్వాత మరోసారి తెలుగు భాష వినిపించింది. కాకినాడ దంపతుల విడాకుల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్వీఎన్ భట్టి స్వయంగా భార్యాభర్తలతో తెలుగులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఓ కేసులో ఇలాగే తెలుగులో మాట్లాడి దంపతుల మధ్య రాజీ కుదిర్చిన విషయం తెలిసిందే.

కెనడాలో నివసిస్తున్న కాకినాడ వాసి ఉడా మధుసూదనరావుపై ఆయన భార్య 2022లో వరకట్నం కేసు పెట్టారు. ఈ కేసులో ఆయనపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. 2024 ఫిబ్రవరిలో భారత్‌కు వచ్చినప్పుడు ఆయన్ను అరెస్ట్ చేయగా, తర్వాత బెయిల్ లభించింది. అయితే, ఈ సందర్భంగా అధికారులు ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. పాస్‌పోర్టు తిరిగి ఇవ్వాలని ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఊరట లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసును సుప్రీంకోర్టు మొదట మధ్యవర్తిత్వానికి పంపింది. అక్కడ, కుమారుడి అవసరాల కోసం భర్త రూ.45 లక్షలు చెల్లించే ఒప్పందంపై పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడానికి ఇద్దరూ ఒప్పుకున్నారు. ఈ ఒప్పందంపై స్పష్టత కోసం శుక్రవారం నాటి విచారణలో జస్టిస్ భట్టి ఇద్దరితో తెలుగులో మాట్లాడారు.

 "మీరు ఏం చేస్తారు? సెటిల్మెంట్ మొత్తం ఇచ్చేశారా?" అని మధుసూదనరావును ప్రశ్నించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్న భార్యను ఉద్దేశించి, "మీరు రూ.45 లక్షలు తీసుకుని, మళ్లీ కెనడా వెళ్లి అక్కడ బాబు ప్రయోజనాల కోసం మళ్లీ డబ్బులు అడిగితే ఎలా అని మీ భర్త అడుగుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి?" అని అడిగారు. దీనికి ఆమె, తన కొడుక్కి 18 ఏళ్లు వచ్చేవరకూ తాను అలాంటిదేమీ చేయనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మధుసూదనరావు జోక్యం చేసుకుంటూ తాను డిపాజిట్ చేసిన మొత్తం, దానిపై వడ్డీ గురించి చెప్పబోగా, జస్టిస్ భట్టి కలుగజేసుకున్నారు. "మీరు ఇవ్వలేదని నేను చదివాను. ఊరికే ఎక్కువ చెబితే విచారణ వాయిదా వేస్తా.. అర్థమైందా?" అని గట్టిగా హెచ్చరించారు. "కెనడాలో కేసులు యాంత్రికంగా ఉంటాయి, కానీ ఇండియాలో మేం మనసు పెట్టి నిర్ణయిస్తాం. బిడ్డను ఎలా చూసుకోవాలో భారతీయ అమ్మలకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు" అని వ్యాఖ్యానించారు.

సెటిల్మెంట్‌కు భార్య సంసిద్ధత తెలపడంతో ధర్మాసనం వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. భర్త డిపాజిట్ చేసిన రూ.45 లక్షలను తల్లి, కుమారుడి జాయింట్ అకౌంట్‌లో జమ చేయాలని, ఆ మొత్తాన్ని బాలుడి అవసరాలకే వాడాలని ఆదేశించింది. మధుసూదనరావు పాస్‌పోర్టును తిరిగి ఇవ్వాలని, ఆయనపై ఉన్న లుక్ అవుట్ నోటీసును ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించింది. విడాకుల ఉత్తర్వులు ఇవ్వడం తమకు బాధ కలిగిస్తుందని, ఇద్దరూ కలిసి ఉంటే సంతోషించేవాళ్లమని ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
SVN Bhatti
Supreme Court
Divorce Case
Kakinda
Justice Ahsanuddin Amanullah
পাসপোর্ট
Look Out Notice
NRI
Family Court
Indian Judiciary

More Telugu News