Shashi Tharoor: భారత్‌లో లక్షల ఉద్యోగాలు గల్లంతు: ట్రంప్ అధిక టారిఫ్‌పై శశిథరూర్ తీవ్ర ఆగ్రహం

Shashi Tharoor criticizes Trump Tariffs Causing Job Losses in India
  • ట్రంప్ నిర్ణయంతో సూరత్ వజ్రాల పరిశ్రమలో లక్షకు పైగా ఉద్యోగాలు పోయాయని ఆరోపణ
  • ఇది సుంకం కాదు, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన కక్షపూరిత ఆంక్షలని వ్యాఖ్య
  • మనకన్నా ఎక్కువ చమురు కొంటున్న చైనాపై చర్యలు లేవని, ఇది అన్యాయమని వ్యాఖ్య
  • ట్రంప్ విచిత్రమైన వ్యక్తి అని, ఆయన విధానాలు అర్థరహితంగా ఉన్నాయని థరూర్ విశ్లేషణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అసాధారణ నిర్ణయాలు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత వస్తువులపై 50 శాతం సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయం దిగ్భ్రాంతికరమని అన్నారు. ఈ చర్య వల్ల ఇప్పటికే సూరత్‌లోని వజ్రాలు, ఆభరణాల పరిశ్రమతో పాటు సముద్ర ఉత్పత్తులు, తయారీ రంగాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు పోయాయని ఆయన ఆరోపించారు. సముద్రపు ఆహారం, తయారీ రంగంలోనూ ఈ ప్రభావం కనిపిస్తోందని తెలిపారు. టారిఫ్‌ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని వాపోయారు.

సింగపూర్‌లో జరిగిన ఒక రియల్ ఎస్టేట్ సదస్సులో భారత్-అమెరికా సంబంధాలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, "ట్రంప్ చాలా చిత్రమైన వ్యక్తి. అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ వ్యవస్థ అపరిమితమైన స్వేచ్ఛను ఇస్తుంది. ఆయన నిర్ణయాల వల్ల భారత ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు" అని ఆయన తెలిపారు. ట్రంప్ కంటే ముందు 44 లేదా 45 మంది అధ్యక్షులుగా పనిచేసినప్పటికీ వైట్ హౌస్ నుంచి ఈ రకమైన ప్రవర్తన ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. సంప్రదాయ దౌత్య ప్రమాణాలను ట్రంప్ గౌరవించడం లేదని విమర్శించారు.

భారత్‌పై విధించిన 50 శాతం సుంకంలో, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అదనంగా 25 శాతం పెనాల్టీ కూడా ఉందని శశిథరూర్ వివరించారు. "ఇది పన్ను కాదు, ఇది కచ్చితంగా మనపై విధించిన ఆంక్షలు. ఇది పూర్తిగా అన్యాయం. ఎందుకంటే మనకంటే చైనానే రష్యా నుంచి ఎక్కువ చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. కానీ వారిపై ఇలాంటి చర్యలు లేవు. రష్యా నుంచి చమురు కొనే అన్ని దేశాలపై ఒకే రకమైన విధానం అమలు చేయాలి కదా?" అని ఆయన ప్రశ్నించారు.

ట్రంప్ వైఖరిని ఎండగడుతూ, "తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని ఒక ప్రపంచ నేత బహిరంగంగా చెప్పడం మీరెప్పుడైనా విన్నారా? చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు" అని శశిథరూర్ అన్నారు. భారత్, రష్యా దేశాలవి డెడ్ ఎకానమీలు అని చెప్పడం ఎప్పుడైనా విన్నారా? ఒక దేశాధ్యక్షుడి నుంచి వినిపించకూడని భాష ఇది అని ఆయన అన్నారు. అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశించడం మనకు చాలా కష్టంగా మారిందని, అయినప్పటికీ చర్చలు జరుగుతున్నాయని, వాటిపై ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో భారత్ కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా తన దౌత్య, ఆర్థిక సంబంధాలను ఇతర దేశాలతో విస్తరించుకోవాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి వెళ్లడం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనుండటం వంటి పరిణామాలు ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆంక్షల విధానం వింతగా, సమర్థించుకోలేని విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Shashi Tharoor
Donald Trump
India US relations
India Russia oil
US tariffs
Indian economy
Job losses India

More Telugu News