Ranbir Kapoor: రణ్‌బీర్-దీపిక బ్రేకప్‌పై నీతూ కపూర్ పాత వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే?

Ranbir Kapoor Mother Neetu Kapoor Defends Him on Deepika Breakup Viral Video
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నీతూ కపూర్ పాత వీడియో
  • రణ్‌బీర్, దీపిక బంధంలో ఏదో లోపం ఉందన్న నీతూ
  • కొడుకును సమర్థిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై మళ్లీ చర్చ
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత వారి బ్రేకప్ గురించి అప్పట్లో ఎంతగా చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ పాత వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. రణ్‌బీర్‌ తల్లి, సీనియర్ నటి నీతూ కపూర్‌కు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవడమే దీనికి కారణం.

గతంలో రణ్‌బీర్‌ కపూర్‌ అతిథిగా హాజరైన ఒక షోలో నీతూ కపూర్‌ వీడియో ద్వారా మాట్లాడారు. ఆ వీడియోలో ఆమె, రణ్‌బీర్-దీపిక బ్రేకప్‌పై స్పందిస్తూ తన కొడుకును సమర్థించారు. "చాలామంది అనుకున్నట్టు రణ్‌బీర్‌కు ఎక్కువ మంది గర్ల్‌ఫ్రెండ్స్ లేరు. అతనికి ఉన్నది ఒకే ఒక్క గర్ల్‌ఫ్రెండ్, అది దీపిక మాత్రమే. బహుశా వాళ్లిద్దరి బంధంలో ఏదో ఒక లోపం ఉండి ఉంటుంది. అందుకే అతను ఆ బంధం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. సంబంధాలు పరిపూర్ణంగా ఉంటే ఎవరూ విడిపోరు కదా" అని నీతూ వ్యాఖ్యానించారు.

అయితే నీతూ కపూర్ వాదనకు పూర్తి భిన్నంగా దీపిక అప్పట్లో స్పందించారు. రణ్‌బీర్‌ తనను మోసం చేశాడని, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని ఆమె ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. "అతను బతిమాలడంతో రెండో అవకాశం ఇచ్చాను. కానీ నా చుట్టూ ఉన్నవాళ్లు చెప్పినా వినకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. చివరికి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాను. ఆ బంధం నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. నమ్మకం, గౌరవం లేని చోట ప్రేమ ఉండదు" అని దీపిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2011లోనే రణ్‌బీర్‌ కపూర్‌ తాను మోసం చేసినట్లు బహిరంగంగా అంగీకరించారు. "అవును, నేను మోసం చేశాను. నా అపరిపక్వత, అనుభవం లేకపోవడం వల్లే ఆ తప్పు జరిగింది" అని ఒక పాత ఇంటర్వ్యూలో ఆయన అంగీకరించడం గమనార్హం. ప్రస్తుతం ఈ పాత వీడియోలు, ఇంటర్వ్యూలు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
Ranbir Kapoor
Deepika Padukone
Neetu Kapoor
Ranbir Deepika breakup
Bollywood breakup
Bollywood news
celebrity relationships
cheating scandal
affair
Bollywood gossip

More Telugu News