Asia Cup 2025: భారత్-పాక్ మ్యాచ్‌పై వివాదం... సోషల్ మీడియాలో ఐపీఎల్ ఫ్రాంచైజీ వినూత్న నిరసన

IPL Franchise Punjab Kings Protests India Pakistan Match
  • ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై రాజుకున్న వివాదం
  • పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో పంజాబ్ కింగ్స్ పోస్ట్
  • భారీ స్పందనతో... కామెంట్స్ సెక్షన్‌ను నిలిపివేసిన ఫ్రాంచైజీ
  • దాయాదుల పోరును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
  • పిటిషన్‌పై అత్యవసర విచారణకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం
ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పై తీవ్ర వివాదం చెలరేగింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశంతో క్రికెట్ ఆడవద్దంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ తనదైన శైలిలో నిరసన తెలిపి ఈ చర్చను మరింతగా వేడెక్కించింది.

ఎల్లుండి జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించి పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది. భారత తదుపరి మ్యాచ్ అంటూ షేర్ చేసిన గ్రాఫిక్‌లో ప్రత్యర్థి జట్టు అయిన పాకిస్థాన్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా ఖాళీగా వదిలేసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో, నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో పంజాబ్ కింగ్స్ తమ ‘ఎక్స్’ ఖాతాలో కామెంట్స్ సెక్షన్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.

మరోవైపు, ఈ మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. "దేశాల మధ్య క్రికెట్ స్నేహాన్ని, సామరస్యాన్ని పెంచాలి. కానీ పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ లాంటి ఘటనల తర్వాత మన సైనికులు ప్రాణత్యాగాలు చేస్తుంటే, ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశంతో క్రీడల పేరుతో సంబరాలు చేసుకోవడం సరికాదు" అని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ మ్యాచ్ ఆడటం వల్ల ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వినోదం కంటే దేశ గౌరవం, పౌరుల భద్రత ముఖ్యమని వారు వాదించారు. అయితే, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ జరగనుంది.
Asia Cup 2025
India Pakistan match
Punjab Kings
IPL franchise protest
Cricket controversy
Terrorism
Supreme Court petition
Falgham attack
Operation Sindoor
India vs Pakistan

More Telugu News