Kulman Ghising: నేపాల్ రాజకీయ సంక్షోభానికి తెర.. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా కుల్మన్ ఘీసింగ్..!

Kulman Ghising Appointed as Nepal Interim Government Leader
  • నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి రేసులో ముందున్న ఇంజనీర్ కుల్మన్ ఘీసింగ్ దేశవ్యాప్తంగా అల్లర్లకు కారణమైన జెన్-జి యువత ఉద్యమం
  • ప్రస్తుతం దేశ పాలనను పర్యవేక్షిస్తున్న నేపాల్ సైన్యం
నేపాల్‌లో హింసాత్మక నిరసనలతో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడే సూచనలు కనిపిస్తున్నయి. యువత (జెన్-జి) చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఓలి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో దేశాన్ని ఎన్నికల వరకు నడిపేందుకు ఏర్పాటైన అపద్ధర్మ ప్రభుత్వ సారథిగా ప్రముఖ ఇంజనీర్, నేపాల్ విద్యుత్ అథారిటీ అధిపతి కుల్మన్ ఘీసింగ్ నియమించే అవకాశాలున్నాయి. దేశంలో విద్యుత్ కోతలకు చరమగీతం పాడిన వ్యక్తిగా, అవినీతి మరకలేని స్వచ్ఛమైన నేతగా ఆయనకు మంచి పేరుంది.

అవినీతి, అసమర్థ పాలనకు వ్యతిరేకంగా జెన్-జి యువత చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకోగా, నిరసనకారులు పార్లమెంటు భవనానికి నిప్పుపెట్టారు. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు జరిగాయి. తొలుత ఖాట్మండు మేయర్ బాలెన్ షా, మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ పేర్లు బలంగా వినిపించాయి. రాజ్యాంగ, న్యాయపరమైన అడ్డంకులతో పాటు, తన వయసు కూడా సహకరించదని సుశీలా కార్కీ తప్పుకున్నారు. దీంతో అందరికీ ఆమోదయోగ్యుడైన కుల్మన్ ఘీసింగ్‌కు దేశ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

మంగళవారం నుంచి నిరసనలు ఉగ్రరూపం దాల్చడంతో దేశ పాలనా పగ్గాలను సైన్యం చేపట్టింది. నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ జెన్-జి ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో తమను కూడా భాగస్వాములను చేయాలని కొంతమంది యువకులు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ను కోరినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Kulman Ghising
Nepal
political crisis
Kulman Ghising Nepal Electricity Authority
Balen Shah
Nepal Army

More Telugu News