Urvashi Jain: అదొక మ్యాచ్ మాత్రమే.. భారత్, పాక్ మ్యాచ్ రద్దు పిటిషన్ పై సుప్రీం ఫైర్

India Pakistan Asia Cup Match Petition Dismissed by Supreme Court
  • అత్యవసరంగా విచారణ జరపాలన్న న్యాయవాదిపై ఆగ్రహం
  • ఆదివారం జరగబోయే మ్యాచ్ కోసం అంత అత్యవసరం ఏంటని ప్రశ్న
  • జాతీయ గౌరవం, ప్రజల మనోభావాలకు విరుద్ధమని పిటిషనర్ల వాదన
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఈ నెల 14 న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరగకుండా అడ్డుకోవాలని, రద్దు చేయాలని ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఊర్వశి జైన్ అనే న్యాయ విద్యార్థిని మరో ముగ్గురితో కలిసి ఈ పిల్ దాఖలు చేసింది. మ్యాచ్ ఆదివారం జరగనున్న నేపథ్యంలో తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దారులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

ఈ అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఆదివారం జరగనున్న మ్యాచ్ కు అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదొక మ్యాచ్ మాత్రమే, జరిగితే జరగనివ్వండి, నష్టమేంటని జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో పిటిషన్ దారుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. శుక్రవారం జాబితాలో చేర్చకపోతే తన పిటిషన్‌ నిష్ఫలమవుతుందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఈ మ్యాచ్‌ జరుగుతోందని గుర్తుచేశారు.

ఈ మ్యాచ్‌ జరగడం జాతీయ గౌరవం, ప్రజల మనోభావాలకు విరుద్ధమైన సందేశాన్ని పంపుతుందని వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలకన్నా, పౌరుల ప్రాణాలకన్నా, సైనికుల ప్రాణత్యాగాల కన్నా ఈ మ్యాచ్ ఎక్కువ కాదన్నారు. క్రికెట్ సహా ఏ ఆట అయినా రెండు దేశాల మధ్య స్నేహాన్ని, సామరస్యాన్ని ప్రదర్శిస్తుందని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తో మ్యాచ్ జరిగితే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళుతుందని ఊర్వశి జైన్ కోర్టుకు తెలిపారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు కూడా ఈ మ్యాచ్‌ కారణంగా వేదనకు గురవుతాయని పేర్కొన్నారు.
Urvashi Jain
India vs Pakistan match
Asia Cup 2024
Supreme Court PIL
Cricket match cancellation
National honor
Public sentiment
Terrorist attacks
Pahalgam attack
Operation Sindoor

More Telugu News