Shah Rukh Khan: షారుక్, దీపికా పదుకొణేలకు ముందస్తు బెయిల్ మంజూరు

Rajasthan High Court Grants Bail to Shah Rukh Deepika
  • కారు యాడ్ వివాదంలో షారుఖ్, దీపికాకు ఊరట
  • రాజస్థాన్ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
  • తయారీ లోపాలకు అంబాసిడర్లు బాధ్యులు కారన్న న్యాయవాదులు
బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలకు రాజస్థాన్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. భద్రతా ప్రమాణాలు లేని కారుకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారంటూ తమపై నమోదైన కేసులో న్యాయస్థానం వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఆరుగురిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై కూడా స్టే విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన కీర్తి సింగ్ అనే మహిళా న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. తాను హ్యూందాయ్ కంపెనీకి చెందిన కారును కొనుగోలు చేశానని, కేవలం షారుఖ్, దీపికా దానిని ప్రమోట్ చేస్తున్నారన్న నమ్మకంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, కారులో అనేక లోపాలు బయటపడ్డాయని, వినియోగదారులను తప్పుదోవ పట్టించారంటూ వారిద్దరితో పాటు మరో ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఆమె ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా షారుఖ్ ఖాన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. కారు తయారీ ప్రమాణాలతో గానీ, దానిలోని లోపాలతో గానీ తన క్లయింట్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. కేవలం బ్రాండ్ ప్రచారంలో పాల్గొన్నంత మాత్రాన ఉత్పత్తి నాణ్యతకు బాధ్యత వహించలేరని ఆయన స్పష్టం చేశారు. దీపికా పదుకొణె తరఫు న్యాయవాది మాధవ్ మిత్రా కూడా ఇదే తరహా వాదనలు వినిపించారు. కారు ఉత్పత్తిలో గానీ, నాణ్యత నియంత్రణలో గానీ తన క్లయింట్ పాత్ర ఏమీ లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. షారుఖ్, దీపికాతో పాటు మిగిలిన వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 25వ తేదీకి వాయిదా వేసింది. 
Shah Rukh Khan
Deepika Padukone
Rajasthan High Court
Hyundai car
brand ambassador
pre-arrest bail
Kapil Sibal
car defects
consumer complaint
misleading advertisement

More Telugu News