దృశ్యం 3 ఎలా ఉంటుందంటే .. దర్శకుడు జీతూ జోసెఫ్

  • దృశ్యం 3 మూవీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన దర్శకుడు  
  • స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్న జీతూ జోసెఫ్
  • ‘దృశ్యం 2’లో చూసినట్లు హై-ఇంటెలిజెన్స్ టాక్టిక్స్, ట్విస్టులు ఉండవన్న జీతూ  
మలయాళంలో మోహన్‌లాల్ - జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దృశ్యం’ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుని, పలు భాషల్లో విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించగా, ఇప్పుడు మూడో భాగం ‘దృశ్యం 3’ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి.

ఈ సందర్భంగా దర్శకుడు జీతూ జోసెఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘దృశ్యం 3’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మూడో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

"దృశ్యం 3 ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. కానీ, ‘దృశ్యం 2’లో చూసినట్లు హై-ఇంటెలిజెన్స్ టాక్టిక్స్, ట్విస్టులు ఉండవని ముందుగానే చెబుతున్నాను. ఇది పూర్తిగా భిన్నంగా ఉండబోతుంది," అని జీతూ స్పష్టం చేశారు. అలాగే, మోహన్‌లాల్ పోషించిన జార్జ్ కుట్టి పాత్రలో గత నాలుగేళ్లలో ఎన్నో మార్పులు చేశానని తెలిపారు. మూడో భాగం పూర్తిగా కొత్త దృక్పథంతో ఉండబోతుందని ఆయన పేర్కొన్నారు.

స్క్రిప్ట్ వర్క్‌కు ఐదు కాపీలు – ఏకంగా విమాన ప్రయాణంలో సన్నివేశాల రచన!

స్క్రిప్ట్‌ను ఐదు రఫ్ కాపీలుగా సిద్ధం చేసుకున్నానన్నారు. ఏప్రిల్‌లో యూరప్ ట్రిప్‌లో ఉన్న సమయంలో విమాన ప్రయాణంలో సన్నివేశాల క్రమాన్ని రచించినట్లు వెల్లడించారు. ఒక్కోసారి తెల్లవారుజామున 3:30కు లేచి కూడా కొన్ని కీలక సన్నివేశాలను రాసినట్లు తెలిపారు.
కెమెరామెన్‌, ఎడిటర్‌ సహా చిత్రబృందంతో స్క్రిప్ట్‌ను పంచుకుని వారి సూచనల మేరకు మార్పులు చేశానని చెప్పారు.

బాక్సాఫీస్‌పై దృశ్యం ప్రభావం

‘దృశ్యం’ ప్రాంఛైజ్‌లోని రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రాలు, ఇప్పటివరకు తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ పాత్రధారులుగా తెరకెక్కాయి. అన్ని భాషల్లోనూ ఈ కథకు విపరీతమైన ఆదరణ లభించింది. 


More Telugu News