Chamarajanagar: పులిని బంధించడంలో అటవీ అధికారుల విఫలం.. అధికారులను పులి బోనులో బంధించిన గ్రామస్థులు!

Villagers lock up forest officials in tiger cage in Karnataka
  • కర్ణాటకలోని బండీపుర టైగర్ రిజర్వులో ఘటన
  • కొన్నాళ్లుగా గ్రామస్థులను భయపెడుతున్న పులి
  • అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం 
  • గ్రామానికొచ్చిన అధికారులను బోనులో బంధించి తాళం వేసిన వైనం
  • సీనియర్ అధికారి సర్ది చెప్పడంతో వదిలిపెట్టిన గ్రామస్థులు
పులిని పట్టుకోవడంలో అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఏకంగా ఆ శాఖ సిబ్బందినే పులి కోసం ఏర్పాటు చేసిన బోనులో బంధించి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా, గుండుల్‌పేట తాలూకాలోని బొమ్మలాపుర గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం బండీపుర జాతీయ పార్క్ సమీపంలోని ఈ గ్రామంలో కొన్ని రోజులుగా ఓ పులి సంచరిస్తోంది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు నాలుగు రోజుల క్రితం ఒక బోనును ఏర్పాటు చేసి, అందులో ఎరగా ఓ దూడను కట్టేశారు. అయితే, బోను వద్దకు వచ్చిన పులి ఆ దూడను చంపి వెళ్లిపోయింది. ఈ విషయం జరిగి రోజులు గడుస్తున్నా, అధికారులు మంగళవారం వరకు ఆ ప్రాంతానికి రాలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

అధికారుల అలసత్వంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బందిని చుట్టుముట్టారు. పులి కోసం పెట్టిన బోనులోనే వారిని బంధించి, తమ ఫోన్లలో వీడియోలు తీశారు. పులిని తక్షణమే పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. సుమారు 15 నిమిషాల తర్వాత ఇతర గ్రామస్థులు, పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని బోనులో ఉన్న వారిని విడిపించారు. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఒకవేళ ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఏనుగుతో సెల్ఫీ... రూ. 25 వేల జరిమానా
మరోవైపు, బండీపుర జాతీయ పార్కులోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పర్యాటకుడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రమాదకరంగా ఏనుగుకు మరీ దగ్గరగా వెళ్లాడు. దీంతో  ఏనుగు అతడిని వెంబడించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ అధికారులు స్పందించారు. ఆ పర్యాటకుడిని గుర్తించి, వన్యప్రాణుల భద్రతకు ముప్పు కలిగించినందుకు రూ. 25,000 జరిమానా విధించారు. బండీపురలో ఏనుగులు, జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతాయని, పర్యాటకులు వాటికి సురక్షితమైన దూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Chamarajanagar
Tiger
Tiger capture
Karnataka
Bandipur National Park
Forest officials
Villagers protest
Wildlife
Elephant selfie
Wildlife fine

More Telugu News