Uday Srinivas: కాకినాడ ఎంపీకి సైబర్ షాక్.. వాట్సాప్ డీపీతో రూ.92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Uday Srinivas Cyber Fraud Kakinada MP Loses 92 Lakhs in WhatsApp DP Scam
  • కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ‘టీ-టైమ్’ సంస్థలో భారీ మోసం
  • ఎంపీ ఫొటోతో వాట్సాప్‌లో నమ్మించిన సైబర్ నేరగాళ్లు
  • రూ.92 లక్షలు బదిలీ చేసిన ఫైనాన్స్ మేనేజర్
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సైబర్ ఫ్రాడ్
  • కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేసిన పోలీసులు
జనసేన పార్టీ కాకినాడ ఎంపీ, ‘టీ-టైమ్’ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టి, ఆయన సంస్థకే చెందిన ఫైనాన్స్ మేనేజర్‌ను నమ్మించి ఏకంగా రూ.92 లక్షలు కాజేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
టీ-టైమ్ సంస్థలో చీఫ్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఓ అపరిచిత నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వ‌చ్చింది. ఆ నంబర్ ప్రొఫైల్ ఫొటోగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చిత్రం ఉండటంతో అది ఆయనేనని శ్రీనివాసరావు భావించారు. తాను కొత్త నంబర్ వాడుతున్నానని, అత్యవసరంగా కొంత డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపారు.

తన యజమానే అడుగుతున్నారని పూర్తిగా విశ్వసించిన మేనేజర్, ఎటువంటి క్రాస్ చెక్ చేసుకోకుండా నేరగాళ్లు సూచించిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మొత్తం 11 విడతల్లో రూ.92 లక్షలు బదిలీ చేశారు.

ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన కంపెనీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తుండగా కొన్ని అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. వెంటనే ఫైనాన్స్ మేనేజర్‌ను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తాను డబ్బుల కోసం ఎలాంటి సందేశాలు పంపలేదని, తన ఫోన్ నంబర్ కూడా మారలేదని ఎంపీ స్పష్టం చేయడంతో మేనేజర్ నివ్వెరపోయారు.

తాము మోసపోయామని గ్రహించిన వెంటనే వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నగదు బదిలీ జరిగిన రెండు వారాల తర్వాత ఫిర్యాదు అందడంతో అప్పటికే నేరగాళ్లు ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి కేవలం రూ.7 లక్షల మొత్తాన్ని మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Uday Srinivas
Kakinda MP
cyber crime
T-Time
WhatsApp fraud
financial fraud
cyber police
Gangi Shetty Srinivasarao
cyber security
online scam

More Telugu News