Ashok Raj Sijdel: ఆర్మీ చీఫ్ ప్రసంగం సమయంలో వెనుక హిందూ రాజు ఫొటో.. నేపాల్‌లో కొత్త చర్చ

Ashok Raj Sijdel Speech with Hindu King Photo Sparks Nepal Debate
  • ఆయన వెనుక మాజీ హిందూ రాజు చిత్రపటం
  • రాచరిక పునరుద్ధరణకు సంకేతమంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ
  • రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శాంతికి పిలుపునిచ్చిన ఆర్మీ చీఫ్
  • 2008లో నేపాల్‌లో రద్దయిన రాచరిక వ్యవస్థ
  • ఇటీవల రాజుకు మద్దతుగా పెరిగిన నిరసనలు
రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతున్న నేపాల్‌లో శాంతి కోసం ఆ దేశ ఆర్మీ చీఫ్ ఇచ్చిన పిలుపు కొత్త చర్చకు దారితీసింది. అయితే, ఆయన చేసిన ప్రసంగం కన్నా, ఆయన వెనుక కనిపించిన ఒక చిత్రపటమే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైంది. ఇది ఓ కీలక రాజకీయ సంకేతమనే ఊహాగానాలు మొదలయ్యాయి.

నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్ మంగళవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన ప్రసంగిస్తున్నప్పుడు వెనుక గోడపై ఆధునిక నేపాల్ వ్యవస్థాపకుడు, 18వ శతాబ్దానికి చెందిన హిందూ రాజు పృథ్వీ నారాయణ్ షా చిత్రపటం కనిపించింది. ఈ ఒక్క దృశ్యం సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది.

ఈ చిత్రపటాన్ని ప్రదర్శించడం వెనుక ఏదైనా నిర్దిష్ట సందేశం ఉందా? అనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి. కొందరు దీనిని "ఒక పెద్ద ముందడుగు" అని అభివర్ణించగా, మరికొందరు "ఇది అతిపెద్ద రాజకీయ సంకేతం" అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై అవినీతి, బంధుప్రీతి ఆరోపణలతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న తరుణంలో, మళ్లీ రాచరిక పాలన రావాలనే వాదనలు ఈ ఏడాది మొదట్లో బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ప్రసంగంలో రాజు ఫొటో కనిపించడం ఈ చర్చను మరింత తీవ్రతరం చేసింది.

నేపాల్ ఆధునిక చరిత్రలో ఎక్కువ కాలం షా వంశీయుల రాచరిక పాలనలోనే ఉంది. ప్రపంచంలో చివరి హిందూ రాజ్యంగా ఉన్న నేపాల్‌లో, 2008లో మావోయిస్టుల తిరుగుబాటు తర్వాత రాచరికం రద్దయింది. అప్పటి రాజు జ్ఞానేంద్ర షా పదవిని కోల్పోయారు. గత 17 ఏళ్లలో 13 ప్రభుత్వాలు మారడంతో దేశంలో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. ఇటీవల ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంపై జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారి 20 మంది మరణించారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ఆర్మీ చీఫ్ ప్రసంగం, దాని వెనుక ఉన్న చిత్రపటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Ashok Raj Sijdel
Nepal
Nepal Army
Prithvi Narayan Shah
Hindu Kingdom
Nepalese Politics
Political Crisis Nepal

More Telugu News