Chandrababu Naidu: ధృతరాష్ట్ర కౌగిలి నుంచి 2024లో విముక్తి లభించింది: వైసీపీ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు

Chandrababu Naidu Slams YSRCP Rule Calls it Dhritarashtra Embrace
  • రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • గత వైసీపీ పాలనను ధృతరాష్ట్ర కౌగిలితో పోల్చిన ముఖ్యమంత్రి
  • 100 రోజుల పాలనలోనే కుప్పానికి కృష్ణా జలాలను అందించామని వెల్లడి
  • సీమలో డిఫెన్స్, సెమీ కండక్టర్, ఏరోస్పేస్ వంటి భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక
  • ఎన్నికల్లో 45 సీట్లు గెలిపించి ప్రజలు తమపై నమ్మకం ఉంచారని వ్యాఖ్య
  • ఎవరు అడ్డుపడినా రాయలసీమ అభివృద్ధి ఆగదని స్పష్టం
రాయలసీమను 'రాళ్ల సీమ' నుంచి 'రతనాల సీమ'గా మార్చి, ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురంలో నిర్వహించిన 'సూపర్ సిక్స్.. సూపర్ హిట్' సభలో ఆయన మాట్లాడుతూ, సీమ అభివృద్ధికి తమ వద్ద స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉందని, దానిని అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

వారి పాలనను 'ధృతరాష్ట్ర కౌగిలి'గా అభివర్ణించిన ఆయన, ఆ కౌగిలిలో చిక్కుకున్న ప్రజలకు 2024 ఎన్నికల్లో విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రూ.3,850 కోట్లతో హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పం వరకు తీసుకువచ్చి, గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని పనిని చేసి చూపించామని తెలిపారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ సీమలోని అన్ని చెరువులను నింపుతున్నామని వివరించారు.

రాయలసీమ అభివృద్ధి ప్రణాళికను వివరిస్తూ, ఈ ప్రాంతంలో డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి భారీ పరిశ్రమలను స్థాపించనున్నట్లు ప్రకటించారు. సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు రహదారులు, విమానాశ్రయాలు, రైల్వే లైన్ల నిర్మాణంతో సీమ రూపురేఖలు మారుస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే రాయలసీమ అభివృద్ధికి పాటుపడిందని, ఎన్టీఆర్ హయాంలోనే హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాలకు గాను 45 చోట్ల కూటమిని గెలిపించి ప్రజలు తమపై అపారమైన నమ్మకం ఉంచారని చంద్రబాబు పేర్కొన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, భవిష్యత్తులో 52కి 52 స్థానాలు గెలిచేలా పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాయలసీమ అభివృద్ధి ఆగదని, ఇది తన హామీ అని ఆయన స్పష్టం చేశారు.

ఫేక్ రాజకీయాలతో మోసం చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. వైసీపీ క్రమంగా ఉనికిని కోల్పోతోందని అన్నారు. పార్టీ కార్యాలయాలు మూసుకొని సామాజిక మాధ్యమ కార్యాలయాలు తెరిచారని ఎద్దేవా చేశారు. రఫా రఫా అంటూ రంకెలు వేస్తున్నారని.. అలా అంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రతిపక్ష హోదా అడుగుతోందని, కానీ ఆ హోదా ఇచ్చేది ప్రజలు అని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇక్కడ ఉన్నది సీబీఎన్ అని, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడితే 10 నిమిషాల్లో పోలీసులు వస్తారని ఆయన అన్నారు.
Chandrababu Naidu
Rayalaseema development
Andhra Pradesh
YSRCP criticism
Super Six Super Hit

More Telugu News