YS Sharmila: 'సూపర్ సిక్స్' సూపర్ హిట్ అనడం సిగ్గుచేటు: ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్

YS Sharmila Fires at Government Over Super Six Claims
  • సూపర్ సిక్స్ పథకాలపై కూటమి ప్రభుత్వానిది కొండంత ్రచారం అని షర్మిల విమర్శ
  • నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని సూటి ప్రశ్న
  • తల్లికి వందనం పథకంలోనూ లక్షలాది మందికి అన్యాయం జరిగిందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండానే 'సూపర్ హిట్' అని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని, ప్రజలను నవ్వించే చర్య అని ఆమె ఘాటుగా విమర్శించారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించారు.

రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగుల్లో కనీసం ఒక్కరికైనా రూ. 3,000 భృతి అందిందా? అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని నిలదీశారు. పరిశ్రమలు స్థాపించకుండానే ఒప్పందాలు చూపి ఉద్యోగాలు సృష్టించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇవ్వకుండానే సూపర్ సిక్స్ విజయవంతమైందని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు.

ఇతర కీలక హామీల అమలు తీరును కూడా షర్మిల తప్పుబట్టారు. "ప్రతి నెలా మహిళలకు రూ. 1,500 ఇస్తామన్న హామీని గాలికొదిలేశారు. రైతుల విషయంలోనూ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది. కేంద్రం ఇచ్చే రూ. 6,000కు అదనంగా ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం 44 లక్షల మంది రైతులకే రూ. 7,000 అందిస్తూ, దాదాపు 30 లక్షల మందికి కోత పెట్టారు" అని విమర్శించారు. అలాగే, 'తల్లికి వందనం' పథకంలో కూడా 87 లక్షల మంది విద్యార్థులకు గాను 20 లక్షల మందికి లబ్ధిని దూరం చేశారని ఆమె పేర్కొన్నారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీపైనా స్పష్టత కొరవడిందని అన్నారు.

ఇవే కాకుండా, ఏటా జాబ్ క్యాలెండర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను, వ్యవసాయ సబ్సిడీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ చెల్లింపులు, పెట్రోల్-డీజిల్ ధరల తగ్గింపు వంటి కీలక హామీల ఊసే లేదని షర్మిల గుర్తు చేశారు. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. ఇప్పటికైనా ఈ హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 
YS Sharmila
Andhra Pradesh
Super Six Schemes
Chandrababu Naidu
Unemployment allowance
Job creation
Farmer schemes
AP politics
Congress Party
Election promises

More Telugu News