సప్నా గిల్ కేసు.. పృథ్వీ షాకు రూ. 100 జరిమానా విధించిన కోర్టు

  • సప్నా గిల్ పిటిషన్‌పై సమాధానం ఇవ్వకపోవడమే కారణం
  • పృథ్వీ షాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సప్నా గిల్
  • చివరి అవకాశంగా గడువు ఇస్తూ డిసెంబర్ 16కు విచారణ వాయిదా
  • షా కావాలనే విచారణను ఆలస్యం చేస్తున్నారని గిల్ తరఫు లాయర్ ఆరోపణ
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబైలోని సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో, కోర్టు ఆదేశించినప్పటికీ కౌంట‌ర్ దాఖలు చేయడంలో విఫలమైనందుకు షాకు రూ. 100 జరిమానా విధిస్తూ మంగళవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
సప్నా గిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని సెషన్స్ కోర్టు పృథ్వీ షాను పలుమార్లు ఆదేశించింది. గత విచారణ సమయంలోనే ఇది చివరి అవకాశమని హెచ్చరించింది. అయినప్పటికీ మంగళవారం నాటి విచారణలో కూడా షా తరఫున ఎలాంటి సమాధానం దాఖలు కాలేదు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, "మరో చివరి అవకాశం ఇస్తున్నాం. కానీ రూ. 100 జరిమానా చెల్లించాలి" అని పేర్కొంటూ తదుపరి విచారణను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేశారు.

పృథ్వీ షా ఉద్దేశపూర్వకంగానే న్యాయ ప్రక్రియను తప్పించుకుంటున్నారని సప్నా గిల్ తరఫు న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ కోర్టులో వాదించారు. "పలుమార్లు సమన్లు జారీ చేసినా, కేసు విచారణలో ఆయన ఇలాగే వ్యవహరిస్తున్నారు" అని ఆయన ఆరోపించారు.

వివాదం నేపథ్యం
2023 ఫిబ్రవరి 15న ముంబైలోని అంధేరిలో ఉన్న ఒక పబ్‌లో సెల్ఫీల విషయమై పృథ్వీ షాకు, సప్నా గిల్ స్నేహితుడు శోభిత్ ఠాకూర్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన తర్వాత షా స్నేహితుడు ఆశిష్ యాదవ్‌పై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి జరిగిందని, తనను బెదిరించి రూ. 50,000 డిమాండ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో పోలీసులు సప్నా గిల్‌ను అరెస్టు చేసి, తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.

అయితే, ఈ ఘటనపై సప్నా గిల్ భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. పృథ్వీ షా, అతని స్నేహితుడే తన స్నేహితుడిపై దాడి చేశారని, తాను అడ్డుకోబోగా పృథ్వీ షా తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు షాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించడంతో ఆమె మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా అనుకూల తీర్పు రాకపోవడంతో ప్రస్తుతం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పైనే షా స్పందించాల్సి ఉంది.


More Telugu News