Karishma Kapoor: తండ్రి ఆస్తి కోసం నటి కరిష్మా కపూర్ పిల్లల న్యాయపోరాటం.. సవతి తల్లిపై ఆరోపణలు!

Karishma Kapoors children fight for fathers property
  • ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ ఆస్తి వివాదంలో కొత్త మలుపు
  • సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్‌పై ఢిల్లీ హైకోర్టులో కరిష్మా కపూర్ పిల్లల కేసు
  • ఆస్తిలో ఐదో వంతు వాటా తమకు ఇవ్వాలని  పిటిషన్
  •  ప్రియ కుట్రపూరితంగా ఆస్తులను చేజిక్కించుకోవాలని చూస్తున్నారని ఆరోపణ 
బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సోనా కామ్‌స్టార్ సంస్థ దివంగత చైర్మన్ సంజయ్ కపూర్ ఆస్తి వివాదం సంచలన మలుపు తీసుకుంది. ఆయన ఆస్తులను చేజిక్కించుకునేందుకు సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్ కపూర్ నకిలీ వీలునామా సృష్టించారని ఆరోపిస్తూ సంజయ్ కపూర్, కరిష్మాల పిల్లలు సమైరా, కియాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి ఆస్తిలో చట్టబద్ధమైన వాటా ఇప్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ ఏడాది జూన్ 12న బ్రిటన్‌లో పోలో ఆడుతూ సంజయ్ కపూర్ ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణానంతరం ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా సచ్‌దేవ్, ఆమె ఇద్దరు అనుచరులతో కలిసి కుట్రపూరితంగా నకిలీ వీలునామా తయారు చేశారని కరిష్మా పిల్లలు తమ పిటిషన్‌లో ఆరోపించారు. సంజయ్ మరణించిన ఏడు వారాల తర్వాత, జులై 30న జరిగిన కుటుంబ సమావేశంలో ఈ వీలునామాను బయటపెట్టారని వారు పేర్కొన్నారు.

"మా నాన్న రాశారని చెబుతున్న వీలునామా చట్టబద్ధమైనది కాదు. అది పూర్తిగా నకిలీది. అనేక అనుమానాస్పద పరిస్థితుల మధ్య దీనిని సృష్టించారు. అందుకే ఇప్పటివరకు మాకు అసలు వీలునామా చూపించలేదు, కనీసం దాని కాపీ కూడా ఇవ్వలేదు" అని పిల్లలు తమ పిటిషన్‌లో వివరించారు. తమను క్లాస్-1 చట్టపరమైన వారసులుగా గుర్తించి తండ్రి ఆస్తిలో చెరొక ఐదో వంతు వాటా ఇప్పించాలని వారు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

జూన్ 19న తన తండ్రి అంత్యక్రియలను కొడుకు కియాన్ పూర్తిచేశాడని, ఆ తర్వాత కొన్ని రోజులకే సవతి తల్లి ప్రియ తమను ఆర్థిక విషయాలకు దూరం పెట్టడం ప్రారంభించారని పిల్లలు ఆరోపించారు. మొదట అసలు వీలునామానే లేదని, ఆస్తులన్నీ ఫ్యామిలీ ట్రస్ట్ కింద ఉన్నాయని చెప్పిన ప్రియ ఆ తర్వాత మార్చి 21 తేదీతో ఉన్న ఒక పత్రాన్ని వీలునామాగా తమ ముందు ఉంచారని తెలిపారు. తమ తండ్రి బతికున్నప్పుడు తమ భవిష్యత్తుకు ఎలాంటి లోటు ఉండదని, ఆర్థికంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని ఎన్నోసార్లు ఆయన హామీ ఇచ్చారని పిల్లలు గుర్తుచేసుకున్నారు.

ఈ కేసులో కరిష్మా కపూర్ పిల్లల తరఫున ఆమె కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతివాదులుగా ప్రియా కపూర్, ఆమె మైనర్ కుమారుడు, సంజయ్ కపూర్ తల్లి, వీలునామా ఎగ్జిక్యూటర్‌గా చెప్పుకుంటున్న మరో మహిళ ఉన్నారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు త్వరలో విచారణ చేపట్టనుంది.
Karishma Kapoor
Sanjay Kapur
Priya Sachdev
property dispute
inheritance
fake will
Delhi High Court
Bollywood
Samaira Kapur
Kiaan Kapur

More Telugu News