Darshan: నాకు విషం ఇచ్చి చంపేయండి: న్యాయమూర్తి ఎదుట వాపోయిన నటుడు దర్శన్

Darshan requests judge for poison in Renukaswamy murder case
  • జైలులో ఉండలేకపోతున్నానంటూ జడ్జిని వేడుకున్న నటుడు దర్శన్
  • జైల్లో సూర్యరశ్మి చూడలేదు... ఫంగస్ భయపెడుతోందని ఆవేదన
  • అలాంటివి కుదరదని స్పష్టం చేసిన న్యాయమూర్తి
  • రేణుకాస్వామి హత్య కేసులో వీడియో కాన్ఫరెన్సులో హాజరు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ కోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేశారు. జైలు పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, తాను ఇక బతకలేనని, తనకు విషమిచ్చి చంపేయాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. 

విచారణలో భాగంగా మంగళవారం 64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఎదుట దర్శన్‌ను జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తితో మాట్లాడుతూ దర్శన్ తన గోడును వెళ్లబోసుకున్నారు. "చాలా రోజులుగా నేను సూర్యరశ్మి చూడలేదు. ఫంగస్ భయపెడుతోంది. నేను వేసుకున్న బట్టలు కూడా దుర్వాసన వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను బతకలేను. దయచేసి కనీసం నాకు విషం ఇవ్వండి. ఇక్కడ జీవితం అత్యంత దుర్భరంగా ఉంది" అని తీవ్ర ఆవేదనతో అన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, "అలాంటివి చేయడం కుదరదు, అది సాధ్యం కాదు" అని స్పష్టం చేశారు.

చిత్రదుర్గకు చెందిన తన అభిమాని రేణుకాస్వామి (33)ని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో దర్శన్‌ను 2024 జూన్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దర్శన్ సన్నిహితురాలైన పవిత్రా గౌడకు రేణుకాస్వామి అసభ్యకర సందేశాలు పంపడమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసులో గతంలో కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్న ఆందోళనలతో సుప్రీంకోర్టు 2025 ఆగస్టు 14న ఆ బెయిల్‌ను రద్దు చేసింది. జైల్లో ఆయనకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించవద్దని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో దర్శన్‌ను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

కాగా, ఈ కేసులో 13, 14వ నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లను న్యాయస్థానం విచారించింది. నిందితులపై అభియోగాల నమోదును సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. తనను బళ్లారి జైలుకు తరలించవద్దని, తనకు బెడ్, పరుపు వంటి సౌకర్యాలు కావాలని దర్శన్ కోర్టును అభ్యర్థించారు.
Darshan
Renukaswamy murder case
Kannada actor
Pavitra Gowda
Karnataka High Court
Supreme Court

More Telugu News