Shreyas Iyer: కేకేఆర్‌లో అవమానం.. అసలు కారణం బయటపెట్టిన శ్రేయస్ అయ్యర్!

Shreyas Iyer Breaks Long Silence On KKR Exit
  • కేకేఆర్‌ను వీడటంపై మౌనం వీడిన శ్రేయస్ అయ్యర్
  • కోల్‌కతాలో తనకు సరైన గౌరవం లభించలేదని వ్యాఖ్య
  • పంజాబ్ కింగ్స్‌లో పూర్తి స్వేచ్ఛ, మద్దతు ఉన్నాయన్న అయ్య‌ర్‌
  • జట్టు వ్యూహాల్లో తనను భాగం చేశారని స్పష్టీక‌ర‌ణ‌
  • ఓ ప్రముఖ మ్యాగజైన్‌ ఇంటర్వ్యూలో కీలక విషయాల వెల్లడి
టీమిండియా స్టార్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన పాత ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్)ను వీడటంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్‌లో తనకు దక్కాల్సినంత గౌరవం లభించలేదని, అందుకే ఆ జట్టును వీడాల్సి వచ్చిందని పరోక్షంగా వెల్లడించాడు. ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్య‌ర్‌ ఈ కీలక విషయాలను బయటపెట్టాడు.

ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను వీడి మెగా వేలంలో పంజాబ్ కింగ్స్‌కు మారిన విషయం తెలిసిందే. అయితే, కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ఆ జట్టును ఎందుకు వీడారనే దానిపై ఇప్పటివరకు ఉన్న ఊహాగానాలకు తాజాగా తన మాటలతో తెరదించాడు.

పంజాబ్ కింగ్స్‌లో తనకు లభిస్తున్న మద్దతు గురించి అయ్యర్ వివరిస్తూ, "ఒక కెప్టెన్‌గా, ఆటగాడిగా నేను జట్టుకు ఎంతో ఇవ్వగలను. నాకు సరైన గౌరవం లభిస్తే ఏదైనా సాధించగలను. పంజాబ్ జట్టులో నాకు అదే దొరికింది. కోచ్‌లు, మేనేజ్‌మెంట్, ఆటగాళ్లు.. ఇలా అందరూ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు" అని తెలిపాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఉత్సాహంతో పంజాబ్ జట్టులోకి అడుగుపెట్టానని, తన అనుభవాన్ని, సూచనలను వారు ఎంతో గౌరవించారని అయ్యర్ అన్నాడు. "ఇక్కడ మేనేజ్‌మెంట్, కోచ్‌లతో జరిగే ప్రతి మీటింగ్‌లో నేను పాల్గొంటాను. వ్యూహరచనలో నన్ను భాగం చేస్తారు. ఇలాంటి వాతావరణంలో పనిచేయడమంటే నాకెంతో ఇష్టం" అని చెప్పాడు. 

ఇదే తరహా ప్రమేయం, గౌరవం కోల్‌కతా జట్టులో తనకు లభించలేదనే విషయాన్ని ఆయన మాటలు స్పష్టం చేశాయి. ఈ వ్యాఖ్యలతో కేకేఆర్ నుంచి అయ్యర్ బయటకు రావడానికి గల అసలు కారణం ఇదేనని క్రీడా వర్గాల్లో చర్చ మొదలైంది.
Shreyas Iyer
KKR
Kolkata Knight Riders
Punjab Kings
IPL 2024
Cricket
Captaincy
Team Management
Indian Premier League
Champions Trophy

More Telugu News