AP Inter Education: ఏపీ ఇంటర్‌లో సరికొత్త శకం.. ఇకపై ఒకేసారి ఇంజనీరింగ్, మెడిసిన్ సబ్జెక్టులు!

AP Inter Education System Revolutionized with MBiPC Option
  • రాష్ట్రంలో ఇంటర్ విద్యలో వినూత్న సంస్కరణలు
  • గ్రూపులతో సంబంధం లేకుండా సబ్జెక్టుల ఎంపికకు అవకాశం
  • 11,000 మందికి పైగా విద్యార్థులు ఎంబైపీసీ వైపు మొగ్గు
  • ద్వితీయ భాష స్థానంలో ఎలక్టివ్ సబ్జెక్టు విధానం అమలు
  • అన్ని గ్రూపుల్లోనూ ఇకపై ఐదేసి సబ్జెక్టులు మాత్రమే
  • ఫిబ్రవరి నుంచే ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్య స్వరూపం సమూలంగా మారిపోయింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎంపీసీ, బైపీసీ వంటి మూస గ్రూపుల విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునేందుకు వీలుగా విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ మార్పులతో ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు రెండు విభాగాల సబ్జెక్టులను ఒకేసారి చదివే అరుదైన అవకాశం లభించింది.

ఎంబైపీసీకి అనూహ్య స్పందన
ఇప్పటివరకు ఎంపీసీ విద్యార్థులు గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు మాత్రమే చదవాల్సి వచ్చేది. అలాగే బైపీసీ విద్యార్థులకు జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలు తప్పనిసరి. కానీ, తాజా సంస్కరణలతో ఈ నిబంధనలు తొలగిపోయాయి. ద్వితీయ భాష స్థానంలో 'ఎలక్టివ్ సబ్జెక్టు' విధానాన్ని తీసుకురావడంతో విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న 24 సబ్జెక్టుల నుంచి దేన్నైనా ఎంచుకోవచ్చు. దీని ఫలితంగా ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని ఎంచుకునే వెసులుబాటు కలిగింది.

ఈ కొత్త విధానం కింద రాష్ట్రవ్యాప్తంగా 11,257 మంది విద్యార్థులు ఎంబైపీసీ వైపు మొగ్గు చూపారు. వీరిలో కొందరు ఎలక్టివ్ సబ్జెక్టుగా ఎంచుకోగా, మరికొందరు అదనపు సబ్జెక్టుగా తీసుకున్నారు. ముఖ్యంగా 7,400 మంది బైపీసీ విద్యార్థులు గణితాన్ని, 3,613 మంది ఎంపీసీ విద్యార్థులు బయాలజీని అదనపు సబ్జెక్టుగా స్వీకరించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో 5,40,924 మంది ప్రవేశాలు పొందారు.

అన్ని గ్రూపుల్లో ఐదే సబ్జెక్టులు
సబ్జెక్టుల ఎంపికలోనే కాకుండా, కోర్సుల నిర్మాణంలోనూ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేసింది. ఎంపీసీలో ఎ, బి లుగా ఉన్న గణితాన్ని ఒకే సబ్జెక్టుగా, బైపీసీలో బోటనీ, జువాలజీని కలిపి బయాలజీగా మార్చింది. దీంతో ఇకపై అన్ని గ్రూపుల్లోనూ ఐదు సబ్జెక్టుల విధానమే అమల్లోకి వచ్చింది.

ముందుగానే పబ్లిక్ పరీక్షలు
కొత్త విధానం వల్ల పరీక్షల షెడ్యూల్‌లోనూ మార్పులు రానున్నాయి. గతంలో గణితం, జీవశాస్త్రం పరీక్షలు ఒకేరోజు జరిగేవి. ఇప్పుడు ఎంబైపీసీ విద్యార్థులకు ఇది సాధ్యం కాదు కాబట్టి, రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున పరీక్షలు నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. దీనివల్ల పరీక్షలు ఎక్కువ రోజులు జరిగే అవకాశం ఉన్నందున, ఏటా మార్చిలో ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ఈసారి ఫిబ్రవరి నుంచే మొదలుపెట్టాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.
AP Inter Education
Andhra Pradesh Intermediate
MBiPC
Engineering
Medicine
MPC
BiPC
Intermediate Education Reforms
AP Education System
Board of Intermediate Education AP

More Telugu News