కేంద్రం మూడు భాషల విధానంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

  • ‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ 2025’ కార్యక్రమానికి హాజరైన లోకేశ్
  • జాతీయ విద్యావిధానానికి (ఎన్‌ఈపీ) పూర్తి మద్దతు
  • మూడు భాషల విధానం హిందీని రుద్దడం కాదని స్పష్టం చేసిన వైనం
  • తాను కూడా మూడు భాషలు నేర్చుకున్న విద్యార్థినేనని వెల్లడి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానానికి (ఎన్‌ఈపీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కోయంబత్తూరులో ‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఎన్‌ఈపీలోని మూడు భాషల విధానాన్ని గట్టిగా సమర్థించారు. ఈ విధానం హిందీని తప్పనిసరిగా రుద్దే ప్రయత్నం కాదని, విద్యార్థులు మూడు భాషలు నేర్చుకునేందుకు ప్రోత్సహించే మంచి అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా లోకేశ్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. "నేను కూడా మూడు భాషలు నేర్చుకున్న విద్యార్థినే. ఇప్పుడు నా కొడుకు కూడా అదే చేస్తున్నాడు. ఈ రోజుల్లో పిల్లలు ఐదు భాషల వరకు నేర్చుకుంటున్నారు. వారికి నచ్చిన జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలు నేర్చుకుంటే ఆయా దేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి" అని ఆయన వివరించారు. పిల్లలకు ఇష్టమైన భాషను నేర్చుకునే స్వేచ్ఛ ఇవ్వాలని, దానిపై రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.

ఇటీవల దిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమైన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. ఆ సమావేశంలో మాతృభాషకు ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై చర్చ జరిగిందని తెలిపారు. "ఒక భారతీయుడిగా నాకు మాతృభాష విలువ తెలుసు, అదే సమయంలో హిందీ నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలూ తెలుసు" అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల ఆసక్తి మేరకు ఒడియా, తమిళం, కన్నడ మాధ్యమాల్లో బోధన చేపట్టేందుకు ఆదేశాలు ఇస్తున్నాం అని వెల్లడించారు.


More Telugu News