Bathukamma Sarees: డ్వాక్రా మహిళలకే బతుకమ్మ చీరలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Revanth Reddy Government to Distribute Bathukamma Sarees Only to DWCRA Women
  • 'రేవంతన్న కానుక' పేరుతో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు
  • ఈసారి కేవలం స్వయం సహాయక సంఘాల మహిళలకే చీరలు
  • ఒక్కో సభ్యురాలికి ఒకటి కాదు, రెండు చీరలు అందించాలని నిర్ణయం
  • గతంలో ఆధార్ ఉన్న ప్రతి మహిళకూ ఒక చీర పంపిణీ
  • చేనేత సహకార సంఘాల నుంచి చీరల సేకరణకు కసరత్తు
  • నాణ్యతపై గతంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం జాగ్రత్తలు
బతుకమ్మ పండుగ సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం చీరల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా అందిస్తున్న ఈ కానుక విషయంలో గత విధానానికి భిన్నంగా కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈసారి 'అక్కా-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక' పేరుతో కేవలం స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) సభ్యులకు మాత్రమే చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా, ఒక్కో సభ్యురాలికి ఒకటి చొప్పున కాకుండా రెండేసి చేనేత చీరలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 'ఇందిరా మహిళా శక్తి' పథకం కింద ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఆధార్ కార్డు ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఒక చీరను బహుమతిగా ఇచ్చేవారు. అయితే, రేవంత్ రెడ్డి సర్కార్ ఆ పద్ధతిని మార్చేసి, కేవలం డ్వాక్రా సంఘాల్లో క్రియాశీలకంగా ఉన్న మహిళలకే ఈ కానుకను పరిమితం చేసింది. దీనికోసం పట్టణ ప్రాంతాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఓ ద్వారా అర్హులైన సభ్యుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

చీరల సేకరణ బాధ్యతను చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోనే సుమారు 9 లక్షలకు పైగా చీరలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15వ తేదీ నాటికి చీరలు జిల్లాలకు చేరుకునేలా కసరత్తు చేస్తున్నారు. అయితే, పండుగకు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇంత పెద్దమొత్తంలో చీరలను సకాలంలో పంపిణీ చేయడం అధికారులకు సవాలుగా మారింది.

గతంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరల నాణ్యతపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. నాసిరకం చీరలు ఇస్తున్నారంటూ మహిళలు ప‌లు చోట్ల నిరసన వ్యక్తం చేయడంతో పాటు, కొన్నిచోట్ల వాటిని దహనం చేసిన సంఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి ఆరోపణలకు తావులేకుండా నాణ్యమైన చేనేత చీరలనే అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Bathukamma Sarees
Revanth Reddy
Telangana
DWCRA women
Self-help groups
Saree distribution
Indira Mahila Shakti
Weavers cooperative societies
Telangana government
Handloom sarees

More Telugu News