Elon Musk: భారత్ విషయంలో ఫైట్.. ‘ఎక్స్’లో అమెరికా అధికారికి మస్క్ దిమ్మతిరిగే కౌంటర్

Elon Musk counters US official on India oil imports on X
  • రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధికారి నవారో తీవ్ర ఆరోపణలు
  • నవారో వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తేల్చిన ‘ఎక్స్’ కమ్యూనిటీ నోట్స్
  • ఆగ్రహంతో మస్క్‌ను విమర్శించిన నవారో.. గట్టిగా బదులిచ్చిన ‘ఎక్స్’ అధినేత
  • నా ప్లాట్‌ఫామ్‌లో ప్రజలే కథనాన్ని నిర్ణయిస్తారని స్పష్టం చేసిన మస్క్
  • నవారో వ్యాఖ్యలను పూర్తిగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదికగా ఒక ఆసక్తికరమైన వాగ్వాదం చోటుచేసుకుంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న అంశంపై అమెరికా వైట్‌హౌస్ సలహాదారు పీటర్ నవారో చేసిన ఆరోపణలకు ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా రంగంలోకి దిగి గట్టి సమాధానం ఇచ్చారు. తన ప్లాట్‌ఫామ్‌లో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ఇక్కడ అన్ని వైపుల వాదనలు వినొచ్చని ఆయన స్పష్టం చేశారు.

అసలేం జరిగింది?
రష్యా నుంచి భారత్ లాభం కోసమే చమురు కొనుగోలు చేస్తోందని, ఉక్రెయిన్ పౌరుల మరణాలకు, అమెరికా ఉద్యోగాలు కోల్పోవడానికి ఇది కారణమవుతోందని నవారో ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను ‘ఎక్స్’ అంతర్గత వాస్తవ తనిఖీ విభాగమైన 'కమ్యూనిటీ నోట్స్' తప్పుదోవ పట్టించేవిగా గుర్తించింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడే భారత్ ఇంధన కొనుగోళ్లు జరుపుతోందని స్పష్టం చేసింది.

ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన నవారో, ‘ఎక్స్’లో తప్పుడు నోట్స్‌ను అనుమతిస్తున్నారంటూ మస్క్‌ను విమర్శించారు. దీనికి మస్క్ బదులిస్తూ, "ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రజలే కథనాన్ని నిర్ణయిస్తారు. ఇక్కడ మీరు వాదనలోని అన్ని కోణాలనూ వినవచ్చు. కమ్యూనిటీ నోట్స్ ఎవరినీ వదలకుండా అందరినీ సరిదిద్దుతుంది" అని స్పష్టం చేశారు. కమ్యూనిటీ నోట్స్ డేటా, కోడ్ బహిరంగంగా అందుబాటులో ఉంటుందని, గ్రోక్ (Grok) ద్వారా మరింత లోతైన వాస్తవ తనిఖీ జరుగుతుందని ఆయన వివరించారు.

ఇదే సమయంలో నవారో చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా ఖండించింది. అవి "అవాస్తవమైనవి, తప్పుదోవ పట్టించేవి" అని కొట్టిపారేసింది. కాగా, భారత్-అమెరికా సంబంధాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "చాలా ప్రత్యేకమైనవి"గా అభివర్ణించడం, ప్రధాని మోదీతో తన స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పడం గమనార్హం. ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ కూడా స్వాగతించారు.
Elon Musk
India Russia oil
Peter Navarro
X platform
community notes
Ukraine war
India US relations
Donald Trump
Narendra Modi

More Telugu News