Indian Hockey Team: హాకీ ఆసియా కప్‌లో భారత్ జయభేరి.. అభినందించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Indian Hockey Team Wins Asia Cup Telugu States CMs Congratulate
  • ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం
  • దక్షిణ కొరియాపై 4-1 తేడాతో గెలుపొందిన టీమిండియా
  • ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆసియా కప్ టైటిల్ కైవసం
  • 2026 హాకీ ప్రపంచకప్‌కు అర్హత సాధించిన భారత్
  • భారత జట్టును అభినందించిన సీఎంలు రేవంత్, చంద్రబాబు, మాజీ సీఎం జగన్
భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న విష‌యం తెలిసిందే. బిహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాపై 4-1 గోల్స్ తేడాతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆసియా ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా, 2026లో జరగనున్న ఎఫ్‌ఐహెచ్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ చారిత్రక విజయంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు హర్షం వ్యక్తం చేస్తూ జట్టుకు అభినందనలు తెలిపారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. డిఫెండింగ్ ఛాంపియన్‌పై ఇంతటి ఘన విజయం సాధించడం దేశం గర్వించదగ్గ క్షణమని ఆయన అన్నారు. ఈ విజయం కేవలం హాకీ జట్టుది మాత్రమే కాదని, యావత్ భారతదేశానిదని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదికగా స్పందించారు. "ఆసియా కప్ 2025 గెలిచిన భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు. ఎనిమిదేళ్ల తర్వాత కొరియాపై 4-1 తేడాతో గెలిచి టైటిల్ సాధించడం భారత క్రీడా రంగంలో గర్వించదగ్గ మైలురాయి. యువ క్రీడాకారులకు ఈ విజయం పట్టుదలకు, కృషికి నిదర్శనంగా నిలుస్తుంది" అని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత హాకీ కీర్తిని మన క్రీడాకారులు ఇలాగే కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రపంచకప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా భారత జట్టును అభినందించారు. ఆసియా కప్‌లో అద్భుత విజయం సాధించిన టీమిండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. జట్టు సభ్యులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Indian Hockey Team
Hockey Asia Cup
India vs South Korea
FIH World Cup 2026
Revanth Reddy
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
Asia Cup Hockey Winners

More Telugu News