Tariq Anwar: గ్రామస్థుడి వీపుపైకెక్కి.. బీహార్ లో కాంగ్రెస్ ఎంపీ పర్యటనలో అమానుషం.. వీడియో ఇదిగో!

Tariq Anwar Seen Carried by Villager During Flood Relief Efforts
  • వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్
  • బురద ప్రాంతంలో ఎంపీని వీపుపై మోసుకెళ్లిన గ్రామస్థుడు
  • ఎంపీ తీరుపై మండిపడుతున్న బీజేపీ నేతలు
  • అన్వర్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ కాంగ్రెస్ సమర్థింపు
బీహార్ లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఇటీవలి వర్షాలకు కతిహార్ ప్రాంతం వరదల్లో మునిగిపోగా.. బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు స్థానిక ఎంపీ తారిఖ్ అన్వర్ అక్కడ పర్యటించారు. ఈ పర్యటనలో ఎంపీ తారిఖ్ అన్వర్ ను ఓ గ్రామస్థుడు వీపుపై మోసుకెళుతున్న వీడియో ఒకటి బయటికి రావడం విమర్శలకు దారితీసింది. 

గ్రామస్థుడి వీపుపైకెక్కి కాలికి బురద అంటకుండా వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ అంటూ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ఎంపీ తారిఖ్ ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే గ్రామస్థుడు ఆయనను మోసుకెళ్లాడని సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

అసలేం జరిగిందంటే..
బీహార్ ను ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని కతిహార్ ప్రాంతం వరదల్లో మునిగిపోయింది. దీంతో కతిహార్ ఎంపీ తారిఖ్ అన్వర్ నియోజకవర్గంలో పర్యటించారు. వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బోటులో, బురద నేల ఉన్న చోట ట్రాక్టర్, బైక్ లపై ఎంపీ ప్రయాణించారు. బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ బురదలో కూరుకుపోయి మొరాయించడంతో ఎంపీ కిందికి దిగారు. ఆపై ఆయనను ఓ గ్రామస్థుడు వీపుపై మోసుకుంటూ తీసుకెళ్లాడు. పక్కనే మరో ఇద్దరు గ్రామస్థులు ఎంపీ పడిపోకుండా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కతిహార్ జిల్లా అధ్యక్షుడు వివరణ ఇస్తూ.. ఆ సమయంలో ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ఎంపీ తారిఖ్ అన్వర్ అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. కళ్లు తిరుగుతున్నాయని ఎంపీ చెప్పడంతో గ్రామస్థులు ముందుకు వచ్చి ఆయనను వీపుపై మోసుకెళ్లారు. ఇది వారు ఎంపీపై ప్రేమతో చేసిందే తప్ప ఎవరూ వారితో బలవంతంగా చేయించలేదని పేర్కొన్నారు.
Tariq Anwar
Bihar floods
Katihar
Congress MP
Indian politics
Viral video
Political controversy
Flood relief
India news
Political ethics

More Telugu News