Rekha Gupta: సీఎం ఆఫీసా? లేక పంచాయతీ కార్యాలయం సమావేశమా..?: ఆప్ విమర్శలు

Rekha Gupta Controversy Over Husband at Official Meeting
  • ఢిల్లీ సీఎంవో సమావేశంలో సీఎం భర్త కూర్చోవడంపై ఆప్ మండిపాటు
  • ఏ హోదాలో ఆయన హాజరయ్యారని ప్రశ్నించిన ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్
  • సీఎంవోను గ్రామ పంచాయతీ స్థాయికి తీసుకెళ్లారంటూ బీజేపీపై ఫైర్
గ్రామ సర్పంచ్ గా మహిళా అభ్యర్థి గెలుపొందితే ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఆమె భర్త అధికారం చెలాయించడం చూస్తుంటాం.. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా పంచాయతీ స్థాయిలోనే ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. ఆదివారం ఢిల్లీ సీఎంవో నిర్వహించిన అధికారిక సమావేశంలో సీఎం రేఖా గుప్త భర్త మనీశ్ గుప్తా పాల్గొనడంపై సౌరభ్ భరద్వాజ్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని మనీశ్ గుప్తా అధికారిక సమావేశంలో ఏ హోదాలో పాల్గొన్నారని ఆయన ప్రశ్నించారు.

ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని బీజేపీ గ్రామ పంచాయతీ స్థాయికి తీసుకెళ్లిందని ఎద్దేవా చేశారు. అంత పెద్ద పార్టీలో సీఎం రేఖా గుప్తాకు నమ్మకమైన అనుచరుడే దొరకలేదా? అని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీపై పదేపదే విరుచుకుపడే బీజేపీ.. ఢిల్లీ సీఎం రేఖా గుప్త తీరును ఎలా సమర్థించుకుంటుందని ఆయన నిలదీశారు. వారసత్వ రాజకీయాలకు, భార్య హోదాను అడ్డుపెట్టుకుని భర్త అధికారం చెలాయించడానికి తేడా ఏముందని సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు.
Rekha Gupta
Delhi CMO
Saurabh Bharadwaj
Manish Gupta
AAP
BJP
Delhi Government
Political Controversy
Delhi Politics
Governance

More Telugu News