England: వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ చారిత్రక గెలుపు.. భారత్ రికార్డు బద్దలు

England obliterate South Africa in historic ODI triumph
  • ద‌క్షిణాఫ్రికాపై 342 పరుగుల భారీ తేడాతో గెలుపు
  • 317 పరుగుల భార‌త రికార్డును బ‌ద్దలు కొట్టిన ఇంగ్లండ్‌
  • ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెథెల్, రూట్ సెంచరీలు
  • కేవలం 72 పరుగులకే కుప్పకూలిన సఫారీ జట్టు
  • భారీ ఓటమి ఎదురైనా 2-1 తేడాతో సిరీస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా
ద‌క్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఇంగ్లండ్ ఏకంగా 342 పరుగుల భారీ తేడాతో గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ క్రమంలో 2023లో శ్రీలంకపై భారత్ సాధించిన 317 పరుగుల గెలుపు రికార్డును ఇంగ్లండ్ బద్దలు కొట్టింది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్, ఆఖరి మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది.

సౌతాంప్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఓపెనర్ జామీ స్మిత్ (48 బంతుల్లో 62) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, జో రూట్, జాకబ్ బెథెల్ అద్భుతమైన సెంచరీలతో కదం తొక్కారు. 21 ఏళ్ల బెథెల్ 82 బంతుల్లోనే 110 పరుగులు చేసి తన తొలి అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశాడు. మరోవైపు, జో రూట్ (100) తన వన్డే కెరీర్‌లో 19వ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి కీలకమైన 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో కెప్టెన్ జోస్ బట్లర్ (32 బంతుల్లో 62) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 414 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారీ లక్ష్య ఛేదనలో ద‌క్షిణాఫ్రికాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫీల్డింగ్ సమయంలో గాయపడిన కెప్టెన్ టెంబా బవుమా బ్యాటింగ్‌కు రాలేదు. ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ నిప్పులు చెరిగే బంతులతో సఫారీ టాపార్డర్‌ను కుప్పకూల్చారు. తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయిన సఫారీలు, పవర్‌ప్లే ముగిసేసరికి 24 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్చర్ 4 వికెట్లతో చెలరేగగా, స్పిన్నర్ ఆదిల్ రషీద్ 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా జట్టు 20.5 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైనప్పటికీ, స‌ఫారీ జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 1998 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై వారికి ఇదే తొలి వన్డే సిరీస్ విజయం. ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 10 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.


England
England vs South Africa
South Africa
One Day International
ODI Record
Joe Root
Jofra Archer
Jacob Bethel
Jos Buttler
Temba Bavuma

More Telugu News