Milind Soman: నేను ప్రధాని మోదీ ఫిట్‌నెస్ కు అభిమానిని: మిలింద్ సోమన్

Milind Soman says I am a fan of PM Modis fitness
  • ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా 'నమో యువ రన్'
  • ప్రచారాన్ని ప్రారంభించిన ప్రముఖ నటుడు, ఫిట్‌నెస్ ఐకాన్ మిలింద్ సోమన్
  • మోదీ ఫిట్‌నెస్ నిబద్ధతకు తాను పెద్ద అభిమానిని అని వెల్లడి
  • సెప్టెంబర్ 21న దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో ఈవెంట్
  • ఒకేసారి పరుగెత్తనున్న దాదాపు 10 లక్షల మంది యువత
  • డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటంలోనూ ఈ పరుగు భాగమేనని వ్యాఖ్య
ప్రముఖ మోడల్, నటుడు, ఫిట్‌నెస్ ఐకాన్ మిలింద్ సోమన్.. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెద్ద అభిమానినని, ముఖ్యంగా ఫిట్‌నెస్ పట్ల ఆయనకున్న నిబద్ధతను ఎంతగానో ఆరాధిస్తానని అన్నారు. ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తలపెట్టిన 'నమో యువ రన్' ప్రచార కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మిలింద్ సోమన్ మాట్లాడుతూ, "ఫిట్‌నెస్ అంటే కేవలం కండలు పెంచడం, సిక్స్ ప్యాక్ చేయడం మాత్రమే కాదు. జీవితంలోని ఒత్తిళ్ల మధ్య కూడా చురుగ్గా ఉంటూ, చేయాల్సిన పనులను సక్రమంగా చేయగలగడమే నిజమైన ఫిట్‌నెస్" అని వివరించారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది యువతతో ఏకకాలంలో పరుగు నిర్వహించడం ఒక అద్భుతమైన కార్యక్రమమని ఆయన ప్రశంసించారు. "భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి రన్ నిర్వహించడం బహుశా ఇదే మొదటిసారి. మార్పు రావాలంటే నిరంతర సాధన ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి" అని ఆయన ఆకాంక్షించారు. ఈ పరుగు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో యువతను భాగస్వాములను చేస్తుందని సోమన్ పేర్కొన్నారు.

బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ, సెప్టెంబర్ 21న ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ 'నమో యువ రన్' జరుగుతుందని తెలిపారు. "దేశవ్యాప్తంగా 75 ప్రాంతాలలో ఈ పరుగును నిర్వహిస్తాం. ప్రతిచోటా 10 వేల నుంచి 15 వేల మంది యువత పాల్గొంటారు. అంటే, దాదాపు 10 లక్షల మంది యువత ఒకే సమయంలో పరుగెత్తుతారు. దేశంలోనే అతిపెద్ద రన్‌గా ఇది రికార్డు సృష్టిస్తుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఎంపీ తేజస్వి సూర్య తదితరులు పాల్గొన్నారు. 
Milind Soman
Narendra Modi
Namo Yuva Run
fitness
BJYM
Tejasvi Surya
India
youth
run
drugs

More Telugu News