Asim Munir: అసిమ్ మునీర్ 'డంపర్ ట్రక్' వ్యాఖ్యలపై పాకిస్థాన్ లో విమర్శల వర్షం

Asim Munirs Dumper Truck Remarks Spark Criticism in Pakistan
  • పాక్‌ను డంపర్ ట్రక్కుతో పోల్చిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్
  • భారత్‌ను మెరిసే మెర్సిడెస్ బెంజ్‌గా అభివర్ణన
  • ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న పాక్ ప్రజలు, మేధావులు
  • సోషల్ మీడియాలో మీమ్స్, విమర్శల వెల్లువ
  • దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ తీవ్ర వ్యతిరేకత
  • ఇది నాయకత్వ వైఫల్యమంటూ జర్నలిస్టుల ఆగ్రహం
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇటీవల సౌదీ అరేబియా ప్రతినిధులతో జరిగిన ఒక సమావేశంలో, ఆయన భారత్‌ను ఓ మెరిసే మెర్సిడెస్ బెంజ్ కారుతో పోలుస్తూ, పాకిస్థాన్‌ను రాళ్లతో నిండిన డంపర్ ట్రక్కుగా అభివర్ణించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై పాక్ ప్రజలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"భారత్ ఒక మెరిసే మెర్సిడెస్ కారు లాంటిది. కానీ మనం రాళ్లతో నిండిన డంపర్ ట్రక్కు లాంటి వాళ్లం. ఈ రెండూ ఢీకొంటే ఏం జరుగుతుందో ఊహించుకోండి," అని సౌదీ ప్రతినిధులతో మునీర్ అన్నట్లు సమాచారం. ఆ తర్వాత పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహసిన్ నఖ్వీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలను పునరావృతం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

మునీర్ వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తాయి. ఒక మెర్సిడెస్ కారు పక్కన బోల్తా పడిన డంపర్ ట్రక్కు ఉన్నట్టు ఏఐ-సృష్టించిన చిత్రాలు, మీమ్స్ వైరల్ అయ్యాయి. తమ దేశాన్ని ఇంత అవమానకరంగా పోల్చడం ఏంటని, ఇది నాయకత్వ లక్షణమేనా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది తమ నాయకుల మేధోస్థాయికి నిదర్శనమని, అందుకే దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) శూన్యంగా ఉన్నాయని మరికొందరు మండిపడ్డారు.

పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు కూడా మునీర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇది నాయకత్వ పతనానికి నిదర్శనమని జర్నలిస్ట్ మోయిద్ పీర్జాదా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పాక్ వ్యూహాత్మక ఆలోచనల్లోని గందరగోళాన్ని, ఆత్మన్యూనతా భావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ముజఫరాబాద్‌కు చెందిన మోహసిన్ ముజఫర్ అన్నారు. "మన ఉన్నత సైన్యాధికారే సొంత దేశాన్ని కించపరుస్తూ, ఇతరులను పొగిడితే మన బలం గురించి ఏం సందేశం వెళ్తుంది?" అని ఆయన ప్రశ్నించారు.

ఈ వివాదం కేవలం సోషల్ మీడియా విమర్శలకే పరిమితం కాలేదు. పాకిస్థాన్‌లో సైనిక, పౌర ప్రభుత్వాల మధ్య ఉన్న అసమతుల్యత, రాజకీయాల్లో సైన్యం జోక్యం పెరిగిపోవడంపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర నిరాశకు ఇది అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రతిష్ఠను, ప్రయోజనాలను దెబ్బతీసే "సెల్ఫ్ గోల్స్" లాంటివని వారు అభిప్రాయపడుతున్నారు.
Asim Munir
Pakistan
Pakistan Army
Saudi Arabia
India
Mohsin Naqvi
economy
foreign direct investment
social media
criticism

More Telugu News