Irina Zhuravska: అమెరికా లోకల్ రైలులో మహిళ దారుణ హత్య.. వీడియో ఇదిగో!

Ukrainian Refugee Irina Zhuravska Killed in US Train Attack
  • ఉక్రెయిన్ నుంచి వలస వచ్చి అమెరికాలో ఆశ్రయం పొందిన ఇరినా
  • నార్త్ కరోలినాలోని షార్లెట్ లో రైలులో ప్రయాణిస్తుండగా కత్తితో దాడి
  • తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు
రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో భయాందోళనల మధ్య బతకలేక అమెరికాకు వలస వచ్చిందో మహిళ.. ప్రాణాలు కాపాడుకోవడానికి వలస వచ్చిన సదరు మహిళ అమెరికాలో దారుణ హత్యకు గురైంది. లోకల్ రైలులో ప్రయాణిస్తుండగా ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. గత నెలాఖరులో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. రష్యా దాడుల నేపథ్యంలో నిత్యం భయంభయంగా గడపలేక ఉక్రెయిన్ మహిళ ఇరినా జరుత్స్కాను అమెరికాకు వలస వచ్చింది. నార్త్ కరోలినాలో ప్రశాంతమైన జీవితం గడుపుతోంది. ఈ క్రమంలోనే గత నెల 22న షార్లెట్‌ లో లోకల్ రైలులో ప్రయాణిస్తుండగా ఓ దుండగుడు ఆమెపై దాడి చేశాడు. రైలులో ఇరినా వెనక సీటులో కూర్చున్న దుండగుడు.. జేబులో నుంచి కత్తి తీసి ఒక్కసారిగా ఇరినాపై దాడికి పాల్పడ్డాడు.

దీంతో తీవ్ర గాయాలు, రక్తస్రావంతో ఇరినా అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం నిందితుడు తర్వాతి స్టాప్‌లో దిగిపోయాడు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. నిందితుడిని డెకార్లోస్‌ బ్రౌన్‌ జూనియర్‌ గా పోలీసులు గుర్తించారు. అతడికి నేర చరిత్ర ఉందని, గతంలో పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడని పేర్కొన్నారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని, డెకార్లోస్‌ బ్రౌన్‌ జూనియర్‌ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
Irina Zhuravska
Ukraine
America
North Carolina
Charlotte
Local train
Murder
Decarlos Brown Jr
Crime
Social media

More Telugu News