MD Basith: సోషల్ మీడియా పోస్టుల గొడవ.. యువకుడి కిడ్నాప్, దారుణ హత్య!

Social Media Posts Led to Kidnapping and Brutal Killing in Bhupalpally
  • భూపాలపల్లిలో కిడ్నాప్ చేసి మేడారం అడవుల్లోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపి, పెట్రోల్ పోసి నిప్పు
  • సాక్ష్యం, సీసీటీవీ ఫుటేజీతో నిందితులను పట్టుకున్న పోలీసులు
  • మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు
  • మృతుడిపైనా పాత కేసులున్నాయని వెల్లడి
సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల కారణంగా తలెత్తిన వివాదం ఓ యువకుడి దారుణ హత్యకు దారితీసింది. తనను దూషిస్తూ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో పోస్టులు పెడుతున్నాడన్న కోపంతో కొందరు యువకులు అతడిని కిడ్నాప్ చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చారు. అనంతరం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. భూపాలపల్లిలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను డీఎస్పీ అవిర్నేని సంపర్రావు శనివారం మీడియాకు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి రాజీవ్ నగర్ వాసి ఎండీ బాసిత్ (20)‌కు, శాంతినగర్‌కు చెందిన రడపాక భాస్కర్, బుస్స ప్రశాంత్, గాజుల కుషాల్ మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. రెండు నెలల క్రితం బాసిత్‌పై వీరు దాడి చేశారు. దీంతో వారిపై పగ పెంచుకున్న బాసిత్ సోషల్ మీడియాలో వారిని కించపరిచేలా పోస్టులు పెట్టడం ప్రారంభించాడు. ఇది సహించలేకపోయిన ఆ ముగ్గురూ.. మరో ముగ్గురు స్నేహితులు పందిళ్ల శ్రవణ్, బరిగల ప్రణయ్, చొప్పరి నవీన్‌ సహాయంతో బాసిత్‌ను అంతమొందించాలని పక్కా ప్లాన్ వేశారు.

ఈ నెల 4న బాసిత్ తన స్నేహితుడు అరుణ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా నిందితులు అడ్డగించి దాడి చేశారు. అనంతరం బాసిత్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అతని చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపేశారు. ఆధారాలు దొరక్కుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

బాసిత్‌తో పాటు ఉన్న స్నేహితుడు అరుణ్ ఇచ్చిన సమాచారం, సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ సంపర్రావు తెలిపారు. కాగా, మృతుడు బాసిత్‌పై కూడా గతంలో గంజాయి, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.
MD Basith
Bhupalpally
social media post
murder
kidnap
Telangana crime
Radapaka Bhaskar
Bussa Prashanth
Gajula Kushal
Medaram forest

More Telugu News