Nara Lokesh: చదువుతో పాటే విదేశీ భాషల్లో శిక్షణ: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Focuses on Foreign Language Training Along with Education
  • జర్మనీలో ఉద్యోగాలు పొందిన వారిని అభినందించిన మంత్రి నారా లోకేశ్
  • గ్రామీణ ప్రాంతాల యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీడాప్ కార్యాచరణ చేపట్టామన్న మంత్రి నారా లోకేశ్
  • ఇకపై చదువుతో పాటు జర్మన్, జపనీస్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషల్లోనూ శిక్షణ అందించనున్నామన్న మంత్రి లోకేశ్
యువతకు చదువుతో పాటు విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సీడాప్ (CDAP) ద్వారా శిక్షణ పొందిన పలువురు యువతులు తాజాగా జర్మనీలో ఉద్యోగాలు పొందిన నేపథ్యంలో వారికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.

"గ్రామీణ ప్రాంతాల యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీడాప్ కార్యాచరణ చేపట్టాం. వచ్చే ఐదేళ్లలో 50 వేల మందికి విదేశీ ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం. మొత్తం 20 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాం" అని మంత్రి స్పష్టం చేశారు.

సీడాప్ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు దక్కేలా శిక్షణ ఇచ్చే వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ఇకపై చదువుతో పాటు జర్మన్, జపనీస్, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషల్లోనూ శిక్షణ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల గ్రామీణ యువతకి విదేశాల్లో కెరీర్ అవకాశాలు విస్తృతంగా లభించనున్నాయి.

విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగం చేయడం తమ చిన్ననాటి కల అని, సీడాప్ ద్వారా ఆ కల నెరవేరిందని యువతులూ హర్షం వ్యక్తం చేశారు. "పేద కుటుంబం నుంచి వచ్చాం. ఆడపిల్లలకు చదువు ఎందుకు అన్న మాటలు విన్నాం. కానీ ఇప్పుడు జర్మనీలో ఉద్యోగం పొందినప్పుడు మా తల్లిదండ్రులు గర్వపడుతున్నారు" అంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు. 
Nara Lokesh
AP Education Minister
CDAP
Foreign Language Training
Andhra Pradesh Jobs
German Jobs
Overseas Education
Skill Development
Youth Empowerment
AP Government

More Telugu News