మండపాల నిర్వాహకులు చక్కటి సహకారం అందిస్తున్నారు: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

  • సాగర్ చుట్టూ 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడి
  • ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని వెల్లడి
  • రేపు ఉదయం లోపు నిమజ్జనం పూర్తవుతుందని భావిస్తున్నామన్న సీపీ
వినాయక నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లు అందుబాటులో ఉన్నాయని, మండపాల నిర్వాహకులకు తమకు చక్కటి సహకారం అందిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం నిరాటంకంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కీలకమైన ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ విగ్రహాల నిమజ్జనం సజావుగా పూర్తయిందని ఆయన తెలిపారు.

విగ్రహాల వాహనాలన్నీ రోడ్లపై వరుసగా వస్తున్నాయని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రధాన మానిటరింగ్ కేంద్రం నుంచి పరిశీలిస్తున్నామని చెప్పారు. వరుసలో ఉన్న వాహనాలన్నీ రాత్రి 11 గంటల లోపు ట్యాంక్‌బండ్ చేరుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.

శోభాయాత్రలో డీజేలు వాడకుండా చర్యలు తీసుకున్నామని, రేపు ఉదయానికల్లా నిమజ్జనం పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రేపు ఆదివారం సెలవు దినం కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకపోవచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనోత్సవంలో ఈసారి ఐటీ అప్లికేషన్స్‌తో పాటు శోభాయాత్రల కవరేజీకి 9 డ్రోన్లను వినియోగించినట్లు ఆయన వివరించారు.


More Telugu News