Vladimir Putin: భారత్-చైనా దోస్తీపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. అమెరికాకు గట్టి సంకేతాలు

Putin Warns US on India China Russia Alliance
  • 'డ్రాగన్-ఏనుగు డ్యాన్స్' ప్రపంచానికి మంచిదన్న జిన్‌పింగ్  
  • కూటమిలో రష్యా కూడా భాగస్వామి అన్న పుతిన్
  • అమెరికా జాతీయ చిహ్నమైన రెండు తలల గద్దపై సెటైర్లు
అంతర్జాతీయ రాజకీయ వేదికపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనదైన శైలిలో అమెరికాకు పరోక్షంగా గట్టి హెచ్చరికలు పంపారు. భారత్-చైనా మధ్య బలపడుతున్న స్నేహాన్ని ప్రస్తావిస్తూ, ఈ కూటమిలో రష్యా కూడా భాగస్వామి అని స్పష్టం చేశారు. జంతువుల ప్రతీకలతో ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

2025 ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించిన పుతిన్, భారత్-చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. "చైనాను డ్రాగన్‌తో, భారత్‌ను ఏనుగుతో పోలుస్తుంటారు. ఈ రెండూ కలిసి చేసే 'డ్రాగన్-ఏనుగు డ్యాన్స్' ప్రపంచానికి మంచిదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. అయితే, మీడియా ఈ డ్యాన్స్‌కు రష్యా ప్రతీక అయిన 'ఎలుగుబంటి'ని కూడా జోడించింది" అని పుతిన్ పేర్కొన్నారు. రష్యాకు ప్రతీకగా ఎలుగుబంటి ఉన్నప్పటికీ, ఇది తూర్పు ప్రాంతం కాబట్టి ఇక్కడి అముర్ పులి (సైబీరియన్ టైగర్) అయితే మరింత బాగుండేదని ఆయన చమత్కరించారు.

అనంతరం ఆయన అమెరికాను ఉద్దేశిస్తూ పరోక్షంగా చురకలు అంటించారు. అమెరికా జాతీయ చిహ్నమైన రెండు తలల గద్ద గురించి ప్రస్తావిస్తూ, "అది ఎప్పుడూ తూర్పు, పడమర వైపు చూస్తుంటుంది. కానీ, ప్రపంచంలో 'దక్షిణం' కూడా ఒకటి ఉందని దానికి గుర్తు చేయాలి" అని అన్నారు. భారత్, చైనా వంటి వర్ధమాన దేశాలను 'గ్లోబల్ సౌత్'గా వ్యవహరిస్తారు. ఈ దేశాల ప్రాధాన్యతను తక్కువగా అంచనా వేయవద్దని పుతిన్ ఈ వ్యాఖ్యల ద్వారా అమెరికాకు గట్టి సంకేతాలు పంపినట్లు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారత్ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా 50 శాతం వరకు సుంకాలు విధించిన నేపథ్యంలో, భారత్-చైనా మధ్య స్నేహ సంబంధాలు బలపడ్డాయి. ఇటీవల జరిగిన ఎస్‌సీఓ సదస్సులో ప్రధాని మోదీ, జిన్‌పింగ్, పుతిన్‌లు ఎంతో ఉల్లాసంగా మాట్లాడుకోవడం ఈ మార్పులకు నిదర్శనంగా నిలిచింది. ఈ క్రమంలో పుతిన్ చేసిన తాజా వ్యాఖ్యలు మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతున్నాయి. 
Vladimir Putin
Russia China India
India China relations
Putin remarks
Eastern Economic Forum
Global South
US foreign policy
SCO summit
Sino Indian relations
international relations

More Telugu News