Hardik Pandya: న్యూ లుక్ లో హార్దిక్ పాండ్యా.. దుబాయ్ చేరుకున్న టీమిండియా

Hardik Pandya New Look India Team Reaches Dubai
  • ఈ నెల 9 నుంచి ఆసియా కప్ టీ20 టోర్నీ
  • 10న యూఏఈతో టీమిండియా తొలి మ్యాచ్
  • హాట్ టాపిక్‌గా మారిన హార్దిక్ పాండ్యా కొత్త హెయిర్‌ స్టైల్
ఆసియా కప్ 2025 టీ20 టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు దుబాయ్‌లో అడుగుపెట్టింది. అయితే, జట్టు రాక కంటే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రాక్టీస్ కోసం మైదానంలోకి అడుగుపెట్టిన హార్దిక్, తన సరికొత్త హెయిర్‌స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లతో కలిసి టీమిండియా శుక్రవారం దుబాయ్ చేరుకుని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా చాలా స్టైలిష్‌గా కనిపించాడు. తలకు శాండీ బ్లాండ్ కలర్ వేసుకుని, ముందు వైపు స్పైక్ కట్ ఉన్న అతని హెయిర్‌ స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. జట్టు టోర్నీకి సిద్ధమవుతున్న తీరు కంటే, హార్దిక్ కొత్త అవతారం గురించే నెట్టింట ఎక్కువగా చర్చ జరుగుతోంది.

సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత జట్టు సెప్టెంబర్ 10న యూఏఈతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 19న ఒమన్‌తో టీమిండియా తలపడుతుంది. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, ఒమన్, యూఏఈ జట్లు ఉండగా, గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ ఉన్నాయి.

ఒకవేళ భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్-4 దశకు అర్హత సాధిస్తే, సెప్టెంబర్ 21న మరోసారి ఈ దాయాదుల పోరు చూసే అవకాశం ఉంటుంది. టోర్నమెంట్ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది. ఇప్పటివరకు 16 సార్లు జరిగిన ఆసియా కప్‌లో, భారత్ అత్యధికంగా 8 సార్లు విజేతగా నిలిచి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శ్రీలంక 6 సార్లు, పాకిస్థాన్ 2 సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నాయి.
Hardik Pandya
Hardik Pandya new look
Asia Cup 2025
India vs Pakistan
Indian Cricket Team
Dubai
Suryakumar Yadav
Gautam Gambhir
Shubman Gill
T20 Tournament

More Telugu News